Revanth reddy: రేవంత్ ను సైలెంట్ గా కూల్ చేసిన దిల్ రాజు

సంధ్య థియేటర్ ఘటన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కచ్చితంగా సినిమా వాళ్ళకు చుక్కలు చూపించడం ఖాయం అనే ఒపీనియన్ అందరిలో బలపడింది. ఈ వ్యవహారంలో ఆయన వెనక్కి తగ్గే అవకాశం లేదనే సంకేతాలు పక్కగా వచ్చాయి. భవిష్యత్తులో కచ్చితంగా భారీ బడ్జెట్ సినిమాలకు రేవంత్ రెడ్డి చుక్కలు చూపించడం ఖాయం అనే ఒపీనియన్ కూడా సినీ వర్గాల్లో కనబడింది. బెనిఫిట్ షోలు అలాగే టికెట్ ధరలు పెంచడం వంటి వాటికీ ఇక తెలంగాణలో ముగింపు పలకాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా గత శనివారం శాసనసభలో ఆయన ప్రకటించారు కూడా. దీనితో ఇక సినిమాలకు కష్టకాలమే అనే సంకేతాలు స్పష్టంగా వచ్చాయి. అయితే ఇక్కడ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఎంటర్ కావడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు కనపడుతుంది. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశమైన దిల్ రాజు… సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీని ముఖ్యమంత్రి ఇవ్వటమే కాకుండా సినిమా పరిశ్రమ సమస్యలను కాస్త సమయం తీసుకుని ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది.
దీనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త శాంతించారని దిల్ రాజు మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఒకటి రెండు రోజుల్లో సినిమా పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశమై తమ కష్టాలను వివరించి పరిస్థితులను కాస్త అర్ధం చేసుకొని తమకు సహకరించాలని కోరనున్నారు. అయితే తెలంగాణలో బెనిఫిట్ షోలకు అలాగే టికెట్ ధరలు పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి ఎంతవరకు అనుమతిస్తారు అనేది మాత్రం క్లారిటీ లేదు.
సాక్షాత్తు శాసనసభలో ప్రకటించారు కాబట్టి ఆ విషయంలో ముఖ్యమంత్రి వెనక్కు తగ్గే అవకాశం లేదు అనే ఒపీనియన్ బలపడుతోంది. అనుమతి ఇస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చినట్లే ఉంటుంది. అందుకే ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉండవచ్చు. తిమ్మిని బమ్మిని చేయడంలో సినిమా పరిశ్రమ నాలుగాకులు ఎక్కువే చదివింది. కాబట్టి ముఖ్యమంత్రిని ఏ విధంగా కూల్ చేస్తారు అనేదానిపైనే వారి భవిష్యత్తు కూడా తెలంగాణలో ఆధారపడి ఉంది.