Allu Arjun: 2 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్న అల్లు అర్జున్

సంధ్య థియేటర్ ఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటం… అలాగే అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో సినిమా పరిశ్రమపై విమర్శలు రావడంతో ఇప్పుడు సినిమా పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అలాగే పుష్ప సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ వ్యవహారంలో సమాజం తమను దోషిగా చూడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు ఎలాగైనా ముగింపు పలకాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. ఈ మేరకు ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసేందుకు అల్లు అర్జున్ సిద్ధమయ్యాడు. రెండు కోట్ల రూపాయలతో శ్రీ తేజ ట్రస్ట్ పెట్టే ఆలోచనను అల్లు అర్జున్ ఉన్నట్లుగా సమాచారం. శ్రీ తేజ ట్రస్ట్ కోసం అల్లు అర్జున్ కోటి రూపాయలు అలాగే సుకుమార్ (Sukumar) 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మెరుగైన వైద్యం విద్య అవసరాలకు ఈ ట్రస్ట్ మూలధనంతో వచ్చే వడ్డీ డబ్బును వాడే ఆలోచనలో ఉన్నారు పుష్ప మేకర్స్.
ట్రస్ట్ సభ్యులుగా శ్రీతేజ్ తండ్రి అలాగే సినీ రంగ పెద్దలు ఉండే అవకాశం ఉంది. అవసరమైతే ట్రస్ట్ కోసం మరింత డబ్బు సమకూర్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. జీవితాంతం బాధిత కుటుంబానికి అండగా ఉండటమే ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు. ఈ సమాచారాన్ని అధికారికంగా ఇప్పటివరకు ఎక్కడ ప్రకటించలేదు. అల్లు అర్జున్ కు న్యాయపరమైన చిక్కులు తొలగగానే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తోంది… అనేది కూడా ఇప్పుడు సినిమా పెద్దలను ఆందోళన గురిచేస్తుంది.
రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడంతో భవిష్యత్తులో సినిమా పరిశ్రమ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో సమస్యను మరింత జటిలం చేయకుండా ఉండేందుకు సినిమా పరిశ్రమ పెద్దలు అల్లు అర్జున్ కు పలు సూచనలు చేశారని, ఈ నేపథ్యంలోనే ఒక ట్రస్టును ఏర్పాటు చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఆసుపత్రికి వెళ్లి చిన్నారి తండ్రికి 50 లక్షల చెక్కును అందించి వచ్చారు. వారితో మంత్రి కోమటిరెడ్డి కూడా ఉండటం గమనార్హం.