Washington: అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్..

చైనాపై సుంకాలు విధించాలన్న అమెరికా అధ్యక్షుడి ట్రంప్(Trump) నిర్ణయంపై చైనా మండిపడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో వాషింగ్టన్ నిర్ణయాన్ని సవాలు చేస్తామని ప్రకటించింది. దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ‘‘అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోంది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా.. సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయి. ఈ విషయాన్ని సహేతుక దృష్టితో వాషింగ్టన్ చూడాలి. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా.. తన దేశంలో ఫెంటనిల్ వంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలి. తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని అమెరికాను కోరుతున్నాం’’ అని చైనా(China) వాణిజ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో కోరింది.
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఫెంటనిల్(fentanyl) అంశం ఒకటి. ఈ డ్రగ్‌ను తమ దేశంలోకి డంప్ చేస్తోందన్న ఒక్క కారణంతోనే చైనాపై 25శాతం అదనపు టారీఫ్‌ను విధిస్తానని నాడే ఆయన హెచ్చరించారు. కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే ఈ నొప్పి నివారిణి.. హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తిమంతమైందని నిపుణులు చెబుతున్నారు. రెండు మిల్లీ గ్రాముల డోసు కూడా ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి బానిసలుగా మారిన వారు తప్పుడు చీటీలతో ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిని ఇతర మాదక ద్రవ్యాలతో కలిపి కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది.
2022 సంవత్సరంలో ఫెంటనిల్ అధిక డోస్ కారణంగా 1,07,941 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా సీడీసీ పేర్కొంది. అంటే సగటున రోజుకు 295 మంది దీని కారణంగా చనిపోతున్నారు. 2023లో ఈ సంఖ్య 1,10,640 ఉండొచ్చని అంచనా వేస్తోంది. 2019లో కొందరు అమెరికా అధికారులు ఈ డ్రగ్‌ను సామూహిక విధ్వంసక ఆయుధంగా వర్గీకరించాలని కోరినట్లు న్యూయార్క్ పోస్టు కొన్ని నెలల కిందట కథనం ప్రచురించింది.