Google: భారత్‌లో గూగుల్ విక్రయ కేంద్రాలు!

యాపిల్ తరహాలోనే గూగుల్ (Google) కూడా తమ పిక్సెల్ ఫోన్లు, వాచీలు, ఇయర్‌బడ్స్ లాంటివి విక్రయించేందుకు ప్రత్యేక షోరూంలను మనదేశంలో ప్రారంభించనుంది. అమెరికా వెలుపల తొలి విక్రయ కేంద్రాన్ని భారత్ (India) లో తెరిచేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అనువైన నగరాల ఎంపికపై దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికా సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet) నేతృత్వంలోని గూగుల్‌కు భారత్ కీలక విపణిగా ఉంది. మన దేశంలో 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.86,000 కోట్లు) పెట్టుబడులు పెడతామని సంస్థ ఇప్పటికే ప్రకటించింది కూడా. షోరూంల కోసం ఢిల్లీ(Delhi), ముంబయి (Mumbai )లలో అనువైన ప్రాంతాలను ఎంపిక చేయడంపై గూగుల్ కసరత్తు చేస్తోంది. దక్షిణాదిలో బెంగళూరునూ పరిశీలిస్తోందని సమాచారం. ఒక్కోటి సుమారు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విక్రయ కేంద్రాలు ఉంటాయని, మొదటి విక్రయ కేంద్రం తెరిచేందుకు 6 నెలల సమయం పట్టొచ్చని ఆ వర్గాలు వెల్లడిరచాయి.