Apple: భారత్‌లో రికార్డు సృష్టించిన యాపిల్
ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ (Apple), సెప్టెంబరు త్రైమాసికంలో భారత్ (India)లో రికార్డు స్థాయి ఆదాయాలను నమోదు చేసింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న మన దేశంలో తయారీతో పాటు రిటెయిల్ విక్రయశాలలను పెంచడం ద్వారా బలమైన వృద్ధి జోరును యాపిల్ కొనసాగిస్తోంది. అంతర్జాతీయంగా సెప్టెంబరు త్రైమాసికంలో యాపిల్ 102.5 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.9 లక్షల కోట్ల) ఆదాయాన్ని నమోదు చేసింది. 2024 ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువ. కొత్త ఐఫోన్ 17కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన రావడంతో డిసెంబరు త్రైమాసికంలోనూ మంచి ఆదాయాలను సంస్థ ఆశిస్తోంది. కంపెనీ చరిత్రలో డిసెంబరు త్రైమాసికం ఆదాయం అత్యుత్తమం కానుందని, అత్యధిక స్థాయిలో ఐఫోన్లు అమ్ముడుపోవచ్చని 2025 నాలుగో త్రైమాసిక ఫలితాల సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) అంచనా వేశారు.







