US: అమెరికాలో షట్ డౌన్ ఎఫెక్ట్.. నెలరోజులకు 62 వేల కోట్లకు పైగా సంపద హాంఫట్..
షట్ డౌన్ .. అమెరికా ఆర్థికవ్యవస్థను కుంచింప చేస్తోంది. నెలరోజులకు పైగా షట్ డౌన్ కొనసాగుతుండడంతో కారణంగా.. 7 బిలియన్ డాలర్లకు పైగా సంపద ఆవిరైంది. ఈ మేరకు కాంగ్రెషనల్ బడ్జెట్ కార్యాలయం అంచనా వేసింది. ఇది మన కరెన్సీలో రూ. 62,149 కోట్లకు పైగా ఉంటుంది.
అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతోంది. కీలక బిల్లుల విషయంలో అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో నెలరోజులకు పైగా అమెరికా ఆర్థిక వ్యవస్థ షట్ డౌన్లోనే ఉంది. షట్‌డౌన్ ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం పడుతుందో కూడా బడ్జెట్ కార్యాలయం అంచనాలు విడుదల చేసింది. ఇప్పటికే షట్‌డౌన్ వల్ల 7 బిలియన్ డాలర్ల మేర సంపద ఆవిరైందని, ఆరు వారాలకు ఇది 11 బిలియన్ డాలర్లు, ఎనిమిది వారాలకు 14 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం జరుగుతుందని అంచనా వేసింది.
ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని, ఈ షట్‌డౌన్ వంటివి ఊహించిన దానికంటే అధిక సమస్యగా పరిణించవచ్చని మూడీస్ అనలిటిక్స్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ షట్‌డౌన్ ప్రభావం చిన్నగా ప్రారంభమైనప్పటికీ, ఆర్థిక నవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని కేపీఎంజీ సంస్థలోని చీఫ్ ఎకనమిస్ట్ డయాన్ స్వాంక్ అన్నారు.
1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు మూతబడింది. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్షుడిగా ఉన్న 2018-19 మధ్య 35 రోజుల పాటు మూతబడింది. దేశ చరిత్రలో అది సుదీర్ఘ షట్డౌన్గా నిలిచింది. ప్రస్తుత షట్‌డౌన్ జాబ్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







