అలా చేస్తే డొనాల్డ్ ట్రంప్ నాలుగోవారు…
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ జనవరి 20న పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ హాజరవుతారా? అనే విషయం ఇప్పటికే ప్రశ్నార్థకంగానే నిలిచింది. అసలు బైడెన్ విజయాన్నే ఇంతవరకు అంగీకరించని ట్రంప్, ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే విషయాన్ని ఇప్పటి వరకూ ప్రకటించలేదు. దీనిపై ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా తాను ఆ విషయంపై మాట్లాడదల్చుకోలేదని జవాబిచ్చారు. అందుకు బదులుగా తన గొప్పదనాన్ని గురించి చెప్పుకొచ్చారు. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడు సాధించనని ఓట్లను తాను గెల్చుకున్నానని, ఈ సంఖ్య ఒబామా కంటే 75 మిలియన్లు ఎక్కువని ఆయన వెల్లడించారు. అయినా తాను ఎన్నికల్లో ఓడిపోయానంటున్నారంటూ అధ్యక్షుడు ఆక్రోశం వ్యక్తం చేశారు. తనకు తక్కువ ఓట్లు వస్తే ఓడిపోయినట్టు ఒప్పుకునేవాడినని, నిజానికి తాను ఓడిపోలేదన్నారు. న్యాయబద్ధం కాని అధ్యక్షుడు అమెరికా పాలించబోవటం తనకు ఆందోళన కలిగిస్తోందని ట్రంప్ అన్నారు.
ఇదిలా ఉండగా బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానట్లయితే.. ఆ విధంగా చేసిన నాలుగో అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచిపోనున్నారు. ఇప్పటి వరకు అగ్రరాజ్యానికి 44 మంది అధ్యక్షత వహించగా వారిలో జాన్ అడమ్స్, జాన్ క్విన్సీ ఆడమ్స్, ఆండ్రూ జాన్సన్‌లు మాత్రమే తమ తర్వాతి అధ్యక్షుడై వారికి స్వయంగా అధికారం అప్పగించేందుకు హాజురు కాలేదు. ఇదిలా ఉండగా తన ప్రమాణ స్వీకారానికి ట్రంప్ హాజరవుతారని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.






