Jagan: జగన్ ధీమా నాయకులకు బూస్టా… లేక పార్టీకి భారమా?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఇటీవల చేసే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఎక్కడ సభ జరిగినా, ఏ సందర్భం వచ్చినా, ఆయన పదేపదే “తిరిగి అధికారంలోకి వస్తాం” అనే మాటనే వినిపిస్తున్నారు. ఇది తన పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని పెంచడానికని కొందరు విశ్లేషకులు భావించినా, మరికొందరు మాత్రం ఈ ధోరణి పార్టీకి మేలు కంటే నష్టం ఎక్కువగా చేస్తోందని అంటున్నారు.
జగన్ తరచుగా చెబుతున్న ఈ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు ఒక విధమైన మానసిక బలం ఇవ్వడానికి ప్రయత్నం కావచ్చు. ముఖ్యంగా గత ఎన్నికల తర్వాత మోరల్‌గా డౌన్ అయిన నాయకులు, కార్యకర్తలకు ఇది ఒక రకమైన ప్రేరణగా పనిచేస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీకి జీవం పోయడం, శ్రేణులను తిరిగి యాక్టివ్ చేయడం కోసం ఈ లైన్‌ను జగన్ వినియోగిస్తున్నట్లు భావిస్తున్నారు.
కానీ ఈ ప్రయత్నానికి మరో వైపు కూడా ఉంది. “ఏమైతేనేం… తిరిగి మన ప్రభుత్వమే వస్తుంది” అనే భావన కొంతమంది నాయకుల్లో నిర్లక్ష్య ధోరణికి దారితీస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలు ప్రజలకు చేరువ కావాల్సింది పోయి, ఇప్పటికే గెలిచినట్టుగా ప్రవర్తించడం ప్రజల్లో విరక్తిని పెంచుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరినైనా ఆకర్షించాల్సిన పరిస్థితిలో, ఎదురు తిరగడం లేదా అహంకార ధోరణి ప్రదర్శించడం పార్టీకే నష్టం కలిగిస్తోందన్న అభిప్రాయం పెరుగుతోంది.
ఏ పార్టీ అయినా తిరిగి అధికారంలోకి వస్తుందని ముందే చెప్పేయడం ప్రజాస్వామ్య ఆత్మకు సరిపోదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రజాభిప్రాయం ఎప్పుడైనా మారవచ్చు. ఎన్నికల్లో ఏ అంశం ప్రభావితం చేస్తుందో, ఏ వాతావరణం ఉంటుందో ముందే అంచనా వేయడం కష్టం. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు కూడా తమిళనాడు (Tamil Nadu) తరహాలో ఒకే పార్టీ ఆధిపత్యం ఉండే రాష్ట్రం కాదు. ఇక్కడ ప్రతి ఎన్నికలో ప్రజలు తమ అభిప్రాయాన్ని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల వైసీపీ శ్రేణులు ఇప్పటికే గెలిచినట్లుగా ప్రవర్తించడం, “అధికారం ఖాయం” అనే ధీమాతో ముందుకు సాగడం పార్టీకి ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు దగ్గర కావడం, సమస్యలు వినడం, తమ పాలనలో జరిగిన లోపాలను అంగీకరించి సరిదిద్దే ప్రయత్నం చేయడం వంటి అంశాలే ఎన్నికల్లో ప్రభావం చూపుతాయనే అభిప్రాయం నిపుణులది.
మొత్తం మీద “మళ్లీ అధికారంలోకి వస్తాం” అనే జగన్ ధీమా పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చినా, అదే ధీమా కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాలు కూడా ఇవ్వొచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రజా అభిప్రాయమే తుది నిర్ణయం తీసుకునే ఈ వ్యవస్థలో, ముందుగానే విజయాన్ని ప్రకటించుకోవడం రాజకీయపరంగా ప్రమాదకరమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.






