HC vs Moshen Raju: మండలి ఛైర్మన్‌కు హైకోర్టు డెడ్‌లైన్.. ఏం జరుగుతుంది?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (AP Legislative Council) వేదికగా సరికొత్త రాజకీయ, న్యాయ పోరాటం మొదలైంది. వైఎస్ఆర్సీపీ (YSRCP) తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై, ఆ తర్వాత పార్టీకి, పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ (Jayamangala Venkata Ramana) వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. రాజీనామా లేఖపై నిర్ణయం తీసుకోవడంలో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు (Moshen Raju) చేస్తున్న కాలయాపనపై హైకోర్టు (AP High Court) సీరియస్ అయ్యింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తేల్చాలని ఆదేశించడంతో, ఈ అంశం ఇప్పుడు వ్యవస్థల మధ్య ఘర్షణకు దారితీస్తుందా అనే చర్చకు తెరలేపింది.
వశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు, ఆ తర్వాత రాజకీయ సమీకరణాల రీత్యా వైసీపీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం ఆయన తన రాజీనామా పత్రాన్ని మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు అందజేశారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రాజీనామా చేసి చాలా కాలం గడుస్తున్నా, ఛైర్మన్ దానిని ఆమోదించలేదు, అలాగని సాంకేతిక కారణాలతో తిరస్కరించనూ లేదు. ఫైలును పెండింగ్‌లో పెట్టేశారు. దీంతో వెంకటరమణ అటు మాజీ కాలేక, ఇటు పదవిలో కొనసాగలేక సతమతమవుతున్నారు. తన రాజీనామాను ఆమోదించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
ఛైర్మన్ మోషేన్ రాజు వైఖరి వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయి. మండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే, సభ్యులు రాజీనామా చేస్తే ఆ స్థానాలు ఖాళీ అవుతాయి. వాటి స్థానంలో అధికార పార్టీ వాళ్లు ఎన్నికవుతారు. అప్పుడు ప్రతిపక్ష వైసీపీ బలం తగ్గుతుంది. అందుకే వాళ్ల రాజీనామాలను ఆమోదించకుండా పెండింగ్ లో ఉంచుతున్నారు. తరా ప్రతిపక్ష పార్టీ (YCP) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం వెంకటరమణ మాత్రమే కాదు, పోతుల సునీత, వంశీకృష్ణ శ్రీనివాస్ వంటి మరికొందరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేశారు. వీరి పట్ల కూడా ఛైర్మన్ ఇదే వైఖరిని అవలంబిస్తున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో వారందరి రాజీనామాలపైనా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
ఈ ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైన అంశం న్యాయస్థానం vs చట్టసభ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 212 ప్రకారం, చట్టసభల (Legislature) అంతర్గత వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. స్పీకర్ లేదా ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాలను సమీక్షించే అధికారం కోర్టులకు పరిమితం. ఇదే పాయింట్‌ను మండలి ఛైర్మన్ తన వాదనగా వినిపించే అవకాశం ఉంది. సభ నడపడం, సభ్యుల అర్హతలు, రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం ఛైర్మన్ విచక్షణాధికారం. ఇందులో కోర్టులు గడువు విధించలేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
అయితే, మణిపూర్ స్పీకర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు ఇక్కడ కీలకం కానుంది. “స్పీకర్ లేదా ఛైర్మన్ రాజ్యాంగం కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేస్తూ, నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా జాప్యం చేస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు” అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లు లేదా రాజీనామాలపై రీజనబుల్ టైమ్ (సాధారణంగా 3 నెలలు) లోపు నిర్ణయం తీసుకోవాలని గతంలో సూచించింది. ఏపీ హైకోర్టు కూడా ఇదే ప్రాతిపదికన 4 వారాల గడువు విధించినట్లు న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ముందు మూడు దారులు ఉన్నాయి. 4 వారాల్లోగా రాజీనామాను ఆమోదించడం లేదా తిరస్కరించడం. ఇది జరిగితే సమస్య సద్దుమణుగుతుంది. లేదంటే శాసనసభల అధికారాల పేరుతో డివిజన్ బెంచ్‌కో, సుప్రీంకోర్టుకో వెళ్ళవచ్చు. అదీ కాదంటే, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం. ఇది జరిగితే న్యాయస్థానధిక్కారం (Contempt of Court) కిందకు వస్తుందా లేక శాసనసభల ఆధిక్యత నెగ్గుతుందా అనేది చూడాలి.
మొత్తానికి, జయమంగళ వెంకటరమణ పిటిషన్ ఏపీ రాజకీయాల్లోనే కాకుండా, రాజ్యాంగపరమైన చర్చకు కూడా దారితీసింది. మండలి ఛైర్మన్ నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. ఆయన మౌనం వీడతారా లేక న్యాయ పోరాటానికి సిద్ధపడతారా అన్నది వేచి చూడాలి.






