Delhi: పాకిస్తాన్ ఓ పెద్ద గురివింద గింజ.. మోడీ కాషాయజెండా వ్యాఖ్యలపై భారత్ స్ట్రాంగ్ రిప్లై..!
ఎక్కడ చిన్న వీలు దొరికినా.. భారత్ ను నిందించడం… నోరుపారేసుకోవడం పాక్ నేతలకు అలవాటు. అంతేకాదు.. అక్కడి ప్రభుత్వ విభాగాలు సైతం అదే ధోరణి అవలంభిస్తున్నాయి. దశాబ్దాలుగా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న పాకిస్తాన్.. లేటెస్టుగా అయోధ్య రామమందిరలో ప్రధాని మోడీ (Modi) కాషాయ జెండా ఎగురవేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ఈ చర్యను భారత్లో మైనారిటీ వర్గాలపై ఒత్తిడి పెంచడానికి, ముస్లిం వారసత్వాన్ని తుడిచిపెట్టే చర్యగా అభివర్ణించింది. 16వ శతాబ్ధపు బాబ్రీ మసీద్ స్థలంలో రామాలయం నిర్మించినట్లు పేర్కొంది. డిసెంబర్ 6, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన జరిగింది. 2019లో సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి, రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. 2020లో రామ మందిరానికి ప్రధాని మోడీ పునాది రాయి వేయగా, 2024లో రామ మందిరం భక్తులకు అందుబాటులోకి వచ్చింది.
అంతేకాదు.. భారత ప్రభుత్వం, న్యాయవ్యవస్థ సైతం.. రామాలయ నిర్మాణానికి సహకరించాయని ఆరోపించింది. మైనార్టీలను అణిచివేయడంతో పాటు ఇస్లామోఫోబియాతో ఆందోళన చెందుతోందని అవాకులు చవాకులు పేలింది.
పాకిస్తాన్ కు భారత్ చెంప పగిలేలా బదులిచ్చింది. పాక్ విదేశాంగ శాఖ జారీ చేసిన ప్రకటనపై..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా బదులిచ్చారు. ‘‘పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని గమనించాం. మతతత్వం, అణచివేత, మైనారిటీల పట్ల దుర్వినియోగం చేయడంలో తీవ్రమైన చెడ్డ పేరు ఉన్న పాకిస్తాన్, ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే నైతిక స్థితి లేదు. కపట ధర్మాలను బోధించే బదులు, పాకిస్తాన్ తన సొంత మానవహక్కుల రికార్డులపై దృష్టి పెట్టడం మంచిది’’ అని జైస్వాల్ అన్నారు.






