Trump: వైట్ హౌస్ దగ్గర కాల్పులపై అమెరికా సీరియస్.. ఉగ్రచర్యే అన్న ట్రంప్..
అమెరికాలో అత్యంత సేఫ్ గా భావించి అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరగడం కలకలం రేపింది. కాల్పుల సమయంలో అదుపులోకి తీసుకున్న వ్యక్తి అఫ్గాన్ జాతీయుడని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధ్రువీకరించారు. అతడి పేరు రెహ్మనుల్లా లఖన్వాల్ (Rahmanullah Lakanwal)గా పేర్కొన్నారు. 2021లో అఫ్గాన్లకు అందించిన స్పెషల్ వీసాపై అగ్రరాజ్యానికి వచ్చినట్లు తెలిపారు. కాల్పుల్లో నిందితుడికి కూడా గాయాలవడంతో.. అతడిని ఆస్పత్రికి తరలించారు..
అమెరికా అధ్యక్ష భవనం సమీపంలో జరిగిన కాల్పులు ఉగ్రచర్యే అని అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ఆరోపించారు. ఈ కాల్పులకు గతంలో మాజీ అధ్యక్షుడు బైడెన్ కారణమని పరోక్షంగా ట్రంప్ విమర్శలు చేశారు.‘ఇది ఒక దారుణమైన దాడి. విద్వేషపూరితమైన ఉగ్రవాద చర్య. ఇది మొత్తం దేశంపై జరిగిన దాడి. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దీన్ని మేం ఖండిస్తున్నాం’ అని ట్రంప్ అన్నారు. కాల్పుల అనంతరం అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఈ భూమి పైనే ప్రమాదకర ప్రాంతమైన అఫ్గానిస్థాన్ (Afghanistan)కు చెందినవాడని పేర్కొన్నారు. అతడు జో బైడెన్ (Joe Biden) పరిపాలన సమయంలో యూఎస్‌లోకి ప్రవేశించాడన్నారు. ఈసందర్భంగా బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు అఫ్గాన్ నుంచి దేశంలోకి వచ్చిన వారందరినీ తిరిగి విచారించాల్సిన అవసరం ఉందన్నారు. శరణార్థులు తమ మనుగడకే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. కాల్పుల నేపథ్యంలో వాషింగ్టన్ (Washington)లో మరో 500 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించాలని ఆదేశించినట్లు తెలిపారు.
కాల్పుల నేపథ్యంలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్ల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాషింగ్టన్ డీసీ కాల్పుల ఘటనలో నిందితుడు అఫ్గాన్ వలసదారుడిగా తేలడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దేశం, అమెరికన్ల భద్రతే తమకు ప్రాధాన్యమని వెల్లడించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్‌హౌస్ జోన్ పరిధిలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డులు ప్రాణాలు కోల్పోయారని వెస్ట్ వర్జీనియా గవర్నర్ ప్రకటించారు. అయితే, నేషనల్ గార్డులు చనిపోలేదని తీవ్రంగా గాయపడ్డారని డైరెక్టర్ కాష్ పటేల్ పేర్కొన్నారు.






