India: రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రేసులో భారత్..!
ప్రస్తుతం ప్రపంచాన్ని గుప్పిటపట్టే శక్తి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కే ఉంది. డిఫెన్స్ ఆయుధ వ్యవస్థలో కీలక వెపన్స్ నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్, సెల్స్ కీలక భాగాల తయారీలో వీటిని వాడుతారు. అయితే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ వ్యవస్థ.. చైనా గుత్తాధిపత్యంలో ఉంది.అందుకే అమెరికా సైతం.. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కోసం చైనాపై ఆధారపడుతున్న పరిస్థితి. ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. అమెరికాకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ (Rare earth magnets) నిలిపివేసి బెదిరించింది డ్రాగన్. అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కు.
అయితే వీటి ప్రాధాన్యత అర్థం చేసుకున్న కేంద్రం కూడా.. కాస్త ఆలస్యంగా అయినా సరే.. ఈరేసులోకి దిగింది. రేర్-ఎర్త్ అయస్కాంతాలపై చైనా గుత్యాధిపత్యం, చైనా ఆంక్షలను అరికట్టడానికి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ మరియు రక్షణ పరికరాల్లో కీలకమైన రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాలు(REPMలు) తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఒక కొత్త పథకాన్ని ఆమోదించింది. భారతదేశం ఏడాదికి 6000 మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ. 7280 కోట్ల ఆర్థిక వ్యయాన్ని ఆమోదించింది. అరుదైన ఎర్త్ ఆక్సైడ్లను లోహాలుగా మార్చడం, లోహాలను మిశ్రమ లోహాలుగా మార్చడం, వీటిని అయస్కాంతాలుగా ఉత్పత్తి చేయడం వంటి ప్రక్రియలు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. ఈ పథకాన్ని ఏడేళ్ల కాలానికి ఆమోదించారు.
ప్రస్తుతం, భారత్ దాదాపుగా శాశ్వత అయస్కాంతాలను దిగుమతి చేసుకుంటోంది. 2030 నాటికి వీటి డిమాండ్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో చైనాపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. మొత్తం బడ్జెట్లో, ఐదు సంవత్సరాలలో అమ్మకాల-సంబంధిత ప్రోత్సాహకాలుగా రూ. 6,450 కోట్లు ఇవ్వనుంది. ఫెసిలిటీల ఏర్పాటుకు రూ.750 కోట్ల మూలధన సబ్సిడీగా అందించనున్నారు.
ఈవీ వాహనాల్లో వాడే మోటార్స్, విండ్ టర్బైన్స్, డ్రోన్లు, శాటిలైట్లు, వైద్య పరికరాల్లో ఈ అయస్కాంతాలు చాలా కీలకం. దేశీయ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే కేంద్రం ఆకాంక్షలను క్యాబినెట్ నిర్ణయం నెరవేర్చనుంది. దీంతో పాటు ఉద్యోగాలను సృష్టించడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం, అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్స్ మార్కెట్లో భారత్‌ను కీలక సభ్యురాలిగా నిలబెట్టాలని కేంద్రం భావిస్తోంది.






