Hong Kong: హాంకాంగ్ లో మృత్యు భవంతి..?
హాంకాంగ్ లోని తైపో ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం సంభవించిన ఈప్రమాదంలో 50 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అనేక మంది గాయపడ్డారు. ఘటన జరిగినప్పటి నుంచి 279 మంది కనిపించడం లేదు. గాయపడిన వారికి సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
మంటల్లో భవంతులు…
వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్‌లో 8 బ్లాకులు ఉన్నాయి. ఒక్కో బ్లాక్‌లో 31 అంతస్తుల నిర్మాణం ఉంది. దాదాపు 2,000 అపార్ట్మెంట్లలో 4,800 మంది నివసిస్తున్నారు. మంటలు ఇంత వేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణాలను అధికారులు గుర్తించారు. ఈ అపార్ట్మెంట్ల బయటి గోడల నిర్మాణం వెదురు బొంగుతో చేశారు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ సమయంలో వాడిన నెట్ తొలగించలేదు. మంటలు వ్యాపించే సమయంలో భారీగా గాలులు వీయడం వల్ల అగ్నికీలలు ఇతర టవర్లకూ పాకి, అవి కూడా తగలబడ్డాయి.
హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ ఈ భారీ అగ్నిప్రమాదంపై స్పందించారు. అత్యవసర బృందాలు కనిపించకుండా పోయిన వారి కోసం వెతుకుతున్నాయని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాన్ని పరిశోధించడానికి పోలీసులు, అగ్నిమాపక విభాగం ఇప్పటికే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా ఈ ఘటనకు కారణమైన ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సంతాపం వ్యక్తం చేశారు.
చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం..
హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద విపత్తులలో ఇదీ ఒకటిగా నిలుస్తోంది. హాంకాంగ్‌లో ఇంతటి తీవ్రత గల లెవల్ 5 అగ్నిప్రమాదం జరగడం సుమారు 17 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అగ్నిమాపక శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ, సమీపంలోని నివాసితులు ఇంటి లోపలే ఉండాలని, తలుపులు, కిటికీలు మూసి ప్రశాంతంగా ఉండాలని సూచించింది.






