Pakistan: కెప్టెన్ క్షేమమేనా..? ఇమ్రాన్ ఖాన్ మృతి వార్తలను ఖండిస్తున్న పాక్ ..
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారా..? ఆయన ఆరోగ్యంగా ఉన్నారని.. మంచి భోజనం అందిస్తున్నామని పాక్ జైలు అధికారులు చెబుతున్నారు .అడియాలా జైలు నుంచి ఇమ్రాన్‌ను తరలించారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. వైద్య సహాయం అందుతుంది. ఆయన మృతి చెందారంటూ జరుగుతున్న ప్రచారం నిరాధారమైనవి’ అని పేర్కొన్నారు పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ . ఇమ్రాన్ బయట కంటే జైలులో సౌకర్యవంతంగా ఉన్నారన్నారు. ఫైవ్‌స్టార్ హోటళ్లలో కూడా లభించని మంచి ఆహారాన్ని అతడు పొందుతున్నారన్నారు. ఆయనకు జైలులో విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఉన్నారు. ఇమ్రాన్ జైలులోనే మరణించారంటూ నెట్టింట వదంతులు వచ్చాయి. బలూచిస్థాన్ విదేశాంగ శాఖ దీనిపై ఎక్స్‌లో పెట్టిన పోస్టు ఊహాగానాలను మరింత పెంచింది. పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీమ్ మునీర్, నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఆయన్ని హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని ఆ పోస్టులో రాసుకొచ్చింది. పలు మీడియా సంస్థల నుంచి దీనిపై వార్తలు రావడంతో.. ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతివ్వాలని ఆయన సోదరీమణులతో కలిసి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు తమపై విచక్షణారహితంగా ప్రవర్తించారని ఇమ్రాన్ సోదరీమణులు ఆరోపించారు. మాజీ ప్రధానిని కలిసేందుకు జైలు అధికారులు అనుమతివ్వకపోవడంతో ఆయన మృతి వార్తలు మరింత ఊపందుకున్నాయి. తాజాగా ఈ వార్తలను జైలు అధికారులు ఖండించారు.
అయితే పాక్ అధికారుల మాటలను ఇమ్రాన్ మద్దతుదారులు నమ్మడం లేదు. పాక్ ఆర్మీ అధికారులు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. కెప్టెన్ ను కలిసేందుకు తమను అనుమతిస్తే.. తాము కళ్లారా చూసి, ఆయనతో మాట్లాడితేనే .. ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారని నమ్ముతామంటున్నారు పీటీఐ పార్టీ కార్యకర్తలు, అభిమానులు. కెప్టెన్ కు ఏమైనా జరిగితే దేశం అగ్నిగుండమవుతుందని పీటీఐ పార్టీ కార్యకర్తలు, కెప్టెన్ అభిమానులు హెచ్చరిస్తున్నారు.






