Chandrababu: చంద్రబాబుపై కేసుల ఎత్తివేతకు రంగం సిద్ధం?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. 2019-2024 మధ్య కాలంలో అప్పటి వైసీపీ (YCP) ప్రభుత్వం.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై (CM Chandrababu) నమోదు చేసిన పలు క్రిమినల్, అవినీతి ఆరోపణల కేసులను ఉపసంహరించుకునేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులను బనాయించారన్న వాదనతో, న్యాయ నిపుణుల సలహా మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు అమరావతి వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై వరుస పెట్టి కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మొదలు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్ల వరకు అనేక కేసులు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత, ఈ కేసుల పూర్వాపరాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇవన్నీ ఆధారాల్లేని ఆరోపణలేనని, కేవలం రాజకీయంగా వేధించడానికే పెట్టిన కేసులని టీడీపీ మొదటి నుంచి వాదిస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని ప్రధాన కేసులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు ప్రధానమైనది. నిధుల మళ్లింపు ఆరోపణలతో నమోదైన ఈ కేసులోనే చంద్రబాబు 50 రోజులకు పైగా జైలులో ఉన్నారు. ఇందులో ఆధారాలు బలహీనంగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఫైబర్ నెట్ స్కామ్ టెండర్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై మరో కేసు దాఖలైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ మార్పు ద్వారా క్విడ్ ప్రో కో జరిగిందనే అభియోగాలపై కూడా చంద్రబాబుపై కేసు పెట్టారు. ఇక అంగళ్లు, పుంగనూరు అల్లర్లపై కేసులు పెట్టారు. ప్రాజెక్టుల సందర్శన సమయంలో జరిగిన గొడవలపై హత్యాయత్నం కింద కేసులు నమోదయ్యాయి. ఇవి పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని కూటమి నేతలు అంటున్నారు.
రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులను ఉపసంహరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇందుకోసం CRPC సెక్షన్ 321 లేదా ప్రస్తుత చట్టాల ప్రకారం అవసరమైన సెక్షన్లను ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం ఉంది. ముందుగా హోం శాఖ, న్యాయ శాఖ ఈ కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడం, కేవలం రాజకీయ కారణాలతో కేసులు పెట్టారని నిర్ధారణ అయితే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లేదా న్యాయం జరగదన్న ఉద్దేశంతో ఈ కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు నివేదిస్తారు. కోర్టు అనుమతితో కేసులను ఎత్తివేస్తారు.
ఈ నిర్ణయం రాజకీయంగా రెండు రకాల చర్చలకు దారితీసే అవకాశం ఉంది. న్యాయం గెలిచిందని టీడీపీ సమర్థించుకోవచ్చు. గత ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేసి అక్రమ కేసులు బనాయించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ నిందల నుంచి చంద్రబాబు బయటపడటం ద్వారా తన నిజాయితీని నిరూపించుకున్నట్లవుతుంది. అయితే వైసీపీ ఇప్పటికే అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులను ఎత్తివేసుకుంటున్నారని ఆరోపిస్తోంది. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేసులను మాఫీ చేసుకుంటున్నారని చెప్తోంది.
మొత్తానికి, చంద్రబాబుపై కేసుల ఎత్తివేత అనేది కేవలం న్యాయపరమైన అంశం మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ కూడా. ఈ ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతుంది? కోర్టులు దీనికి ఎలా స్పందిస్తాయి? అనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది. ఏది ఏమైనా, చంద్రబాబుకు ఈ కేసుల నుంచి విముక్తి లభిస్తే, అది ఆయన ప్రభుత్వానికి, వ్యక్తిగత ఇమేజ్‌కు పెద్ద ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు.






