Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పోర్న్ స్టార్‌కు హష్ మనీ (Hush money) వ్యవహారంలో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు (New York court) తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని మన్‌హట్టన్ న్యాయమూర్తి జువాన్ మర్చన్ (Juan Marchan) స్పష్టం చేశారు. ఇలాంటి అనధికారిక ప్రవర్తన విషయంలో ట్రంప్‌నకు రక్షణ వర్తించదని వ్యాఖ్యానించారు. హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా, ఈ ఏడాది నవంబరులో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.
అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో ఆయన క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. తాజాగా ట్రంప్‌నకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చింది. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఈ కేసులో ఆయనకు ఊరట లభించకపోతే శిక్ష అభియోగాలను ఎదుర్కొంటూ శ్వేతసౌధం లోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచే అవకాశం ఉంది.






