Iran: అమెరికా ఆర్థికాస్త్రానికి దశాబ్దాలుగా ఇరాన్ విలవిల..!
అగ్రరాజ్యం అమెరికాతో దశాబ్దాల వైరం ఇరాన్ ను అదఃపాతాళానికి నెట్టేసింది. ఎంతలా అంతే.. అక్కడి పౌరుల కనీస అవసరాలు తీర్చుకోలేనంతగా.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనా..నాలుగు దశాబ్దాలుగా పాలన సాగిస్తున్నా.. ఆ దేశాన్ని ఒడ్డున పడేయలేకపోతున్నారు. ఎలా బతకాలంటూ ప్రారంభమైన ప్రజానిరసన రక్తసిక్తమైంది. అధినాయకత్వాన్ని మార్చాలని వాళ్లు ఎంతగా ప్రయత్నించినా..బలంగా వేళ్లూనుకు పోయిన ఇరాన్ అధినాయకత్వం, సైన్య బలంతో పౌరులను ఊచకోత కోస్తోంది. అంటే అమెరికా.. ఇరాన్ మధ్య వైరంలో అమాయక ఇరానీలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
అమెరికా టార్గెట్ చేస్తే దేశాలు ఆర్థికంగా ఎంత దారుణంగా నష్టపోతాయనటానికి ఇరాన్ ఇప్పుడు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ దేశ కరెన్సీ (రియాల్) చరిత్రలో ఎప్పుడూ లేనంత దారుణంగా కనిష్ఠ స్థాయికి దిగజారిపోయింది. గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. అగ్రరాజ్యం అమెరికాతో నడుస్తున్న పంచాయితీ ఇరాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తీసింది. ఇరాన్ కరెన్సీ దారుణ స్థితికి చేరుకుంది.
ఒక అమెరికన్ డాలర్ కు ఏకంగా 15 లక్షల రియాల్స్ కు చేరుకున్న దుస్థితి. అణ్వస్త్ర కార్యక్రమాల కారణాల నేపథ్యంలో ఇరాన్ తీవ్రమైన ఆర్థిక ఆంక్షల్ని ఎదుర్కొంటోంది. దీంతో.. రియాల్స్ విలువ పాతాళానికి పడిపోతోంది. ఇప్పుడు ఒక అమెరికన్ డాలర్ కు 15 లక్షల రియాల్స్ ఇస్తుంటే.. యాభై ఏళ్ల క్రితం అమెరికా డాలర్ వర్సెస్ ఇరాన్ రియాల్ చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.యాభై ఏళ్ల క్రితం అంటే 1976లో ఒక అమెరికన్ డాలర్ విలువ సుమారు 68.7 ఇరానియన్ రియాల్స్ గా ఉండేది. ఆ తర్వాత నుంచి కాస్త కాస్త పడిపోవటం మొదలైంది. 1979 నాటికి 70 రియాల్స్ ఉండగా.. పదేళ్ల క్రితం (2016) ఒక అమెరికా డాలర్ కు 30,914 రియాల్స్ సమాధానం ఇచ్చిన పరిస్థితి. బహిరంగ మార్కెట్ లో 34వేల రియాల్స్ ఇచ్చినట్లుగా చెబుతారు. అదే డాలర్ ఇప్పుడు ఏకంగా 15 లక్షల రియాల్స్ కు కానీ చేతికి రాని రాతను చూస్తే.. అమెరికాను దుర్కోవటం అంత తేలికైన విషయయం కాదన్నది ప్రపంచానికి అర్థమవుతుంది.






