Cabinet: తిరుమల కల్తీ నెయ్యిపై తొందరపడొద్దన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంపై సుదీర్ఘ చర్చ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అపచారానికి సంబంధించిన సంచలన వాస్తవాలను మంత్రులు, ఉన్నతాధికారులు కేబినెట్ ముందు ఉంచారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వంపై నెట్టేందుకు ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రులు తీవ్రంగా ఖండించారు.
సమావేశంలో అధికారుల నివేదిక ప్రకారం, గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) సరఫరా అయిన నెయ్యిలో కల్తీ జరిగిందనేది అక్షర సత్యమని తేలింది. కాంట్రాక్టులు దక్కించుకున్న కొన్ని డెయిరీలకు అసలు అంత సామర్థ్యమే లేదని అధికారులు వెల్లడించారు. పాలు సేకరించే సామర్థ్యం లేకపోయినా, కొన్ని డెయిరీలు కొన్ని రకాల రసాయనాలను మిశ్రమం చేసి నెయ్యిని తయారు చేశాయని, దానినే భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదానికి వాడారని వివరించారు. ఈ వ్యవహారంలో మాజీ టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న ఖాతాలో దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు జమ అయిన విషయాన్ని మంత్రులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు.
మంత్రివర్గ చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ నేర ప్రవృత్తిపై ఘాటుగా స్పందించారు. “తప్పు చేయడం, ఆపై ఎదుటివారిపై బుకాయించడం వైసీపీకి అలవాటే” అని ఆయన మండిపడ్డారు. గతంలో జరిగిన కొన్ని కీలక సంఘటనలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. కోడి కత్తి దాడి, బాబాయిపై గొడ్డలి పోటు, గులక రాయి ఘటనల సమయంలో వైసీపీ ఎలాగైతే అబద్ధాలతో రాజకీయం చేసిందో.. ఇప్పుడు నెయ్యి కల్తీ విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తోంది. తప్పులు చేస్తారు, ఆపై ఆ నిందను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తారని చంద్రబాబు చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సిట్ (SIT) విచారణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారని మంత్రులు గుర్తు చేశారు. అయినప్పటికీ, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కొనసాగిందని, ప్రాథమిక నివేదికలో కల్తీ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని కేబినెట్ చర్చించింది.
సిట్ పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతే ఈ అంశంపై అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడిద్దామని ముఖ్యమంత్రి సూచించారు. అప్పటి వరకు మంత్రులందరూ అప్రమత్తంగా ఉండాలని, వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని ఆదేశించారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించే వరకు వదిలే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.






