Siddharth Luthra: సిద్ధార్థ్ లూత్రాకు ఏపీ నుంచి కాసుల వర్షం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత స్థాయి చట్టపరమైన పోరాటాల కోసం భారీగా ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో ప్రభుత్వం తరపున వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాకు తాజాగా రూ. 1,15,50,000 ఫీజుగా చెల్లిస్తూ హోం శాఖ రెండు వేర్వేరు జీవోలను విడుదల చేసింది. క్రైమ్ నెం. 21/2024 కు సంబంధించిన ఈ కేసులో నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుకోవడంలో లూత్రా కీలక పాత్ర పోషించారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 104 ప్రకారం, సెప్టెంబర్ 2025లో ఐదు రోజుల పాటు (19, 22, 23, 24, 26 తేదీల్లో) హైకోర్టులో జరిగిన విచారణకు సిద్ధార్థ్ లూత్రా హాజరయ్యారు. ఈ ఐదు రోజులకు గానూ ఆయనకు కోటి రూపాయల ప్రొఫెషనల్ ఫీజును ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందులో విశేషమేమిటంటే, సెప్టెంబర్ 24న ఒక్క రోజు హాజరీకే ఆయనకు రూ. 40 లక్షలు చెల్లించారు. మిగిలిన నాలుగు రోజులకు రోజుకు రూ. 10 లక్షల చొప్పున ఫీజు లెక్కించారు. దీనికి అదనంగా 10 శాతం క్లర్కేజీ (రూ. 10 లక్షలు) కలిపి మొత్తం రూ. 1.10 కోట్లు మంజూరు చేశారు.
మరోవైపు, నవంబర్ 18, 2025న జరిగిన ఒకే ఒక్క విచారణ కోసం ప్రభుత్వం మరో రూ. 5.50 లక్షలను (రూ. 5 లక్షల ఫీజు + రూ. 50 వేల క్లర్కేజీ) జీవో నెం. 103 ద్వారా విడుదల చేసింది.
సిద్ధార్థ్ లూత్రా వంటి టాప్ రేటెడ్ లాయర్లను రంగంలోకి దించారంటేనే ఈ కేసు ఎంత సీరియస్సో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) వేదికగా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం పాలసీని మార్చడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 3,500 కోట్ల నుండి రూ. 5,000 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని సీఐడీ (CID) అభియోగం మోపింది. కొన్ని ప్రత్యేక డిస్టిలరీలకే మేలు చేసేలా టెండర్లు కట్టబెట్టడం, ప్రముఖ బ్రాండ్లను రాష్ట్రం నుండి తప్పించి నాణ్యత లేని లోకల్ బ్రాండ్లను ప్రోత్సహించడం ద్వారా భారీగా ముడుపులు అందాయని కేసు నమోదైంది. ఈ కేసులో గత ప్రభుత్వంలోని కీలక నేతలు, కొందరు ఐఏఎస్ అధికారులు నిందితులుగా ఉండటంతో ఇది రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
ఈ కేసు కేవలం ఒక అవినీతి కేసు మాత్రమే కాదు, రాజకీయంగా కూడా ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం. మద్యం కుంభకోణం ద్వారా సామాన్య ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, రాష్ట్ర ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేసులో నిందితులు చాలా బలవంతులు కావడంతో, హైకోర్టులో వారికి బెయిల్ రాకుండా చూడటం, క్వాష్ పిటిషన్లను ఎదుర్కోవడానికి సిద్ధార్థ్ లూత్రా వంటి నిపుణుల అవసరం ఏర్పడింది.
సాధారణంగా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు పరిమితుల కంటే సిద్ధార్థ్ లూత్రా ఫీజు ఎక్కువగా ఉన్నప్పటికీ, కేసు ప్రాముఖ్యత దృష్ట్యా నిబంధనలను సడలించి మరీ ఈ నిధులను మంజూరు చేసింది. సిద్ధార్థ్ లూత్రా గతంలోనూ రాష్ట్రానికి సంబంధించిన అనేక హై-ప్రొఫైల్ కేసులను డీల్ చేసిన అనుభవం ఉండటంతో, ప్రభుత్వం ఆయనపైనే పూర్తి నమ్మకం ఉంచింది.
ఈ ఫీజులను చెల్లించడానికి ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి ప్రత్యేక అనుమతులు తీసుకుంది. అమరావతిలోని డిప్యూటీ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ద్వారా ఈ మొత్తాన్ని నేరుగా లూత్రా బ్యాంక్ ఖాతాకు జమ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ఖజానాపై ఇంత భారీ భారం పడుతున్నా, మద్యం స్కాం దోషులను బోనులో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.






