Greg Abbot: ట్రంప్ అడుగు జాడల్లో టెక్సాస్.. కొత్త హెచ్1 బి వీసా దరఖాస్తుల నిలిపివేత..!
అమెరికాలో హెచ్1బి వీసా దారులకు కష్టాలు మరింతపెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశాధ్యక్షుడు హెచ్ 1బి వీసాదారులను టార్గెట్ చేసి.. కొత్త దరఖాస్తు దారులకు లక్ష డాలర్ల ఫీజు విధించారు. దీంతో చాలా వరకూ అమెరికా వెళ్లాలనుకున్న ఔత్సాహికులు.. తమ ప్రయత్నాలు విరమించుకున్నారు. దిగ్గజ కంపెనీలు సైతం.. ఎంతో అవసరమైతే తప్ప, కొత్తవారికి స్పాన్సర్ చేయడం లేదు. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్.
అమెరికాలోని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు (Texas halts new H-1B visa petitions). 2027 మే 31 వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా (H-1B Visa) కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని అబాట్ ఆరోపించారు. అమెరికన్ ఉద్యోగాలు దేశ కార్మికులకే దక్కాలని ఆయన వ్యాఖ్యానించారు.
‘హెచ్-1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం అయ్యిందని ఇటీవల నివేదికలు అందాయి. అమెరికన్ ఉద్యోగాలు.. దేశ ప్రజలకే వెళ్తున్నాయని నిర్ధరించుకునేందుకు దీనిపై సమీక్ష జరగనుంది. ఈ క్రమంలో కొత్త వీసా పిటిషన్లను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ఏజెన్సీలను ఆదేశిస్తున్నా’ అని అబాట్ ఏజెన్సీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. టెక్సాస్ కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనం కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పనిచేయాలని అబాట్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులతో కూడిన ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన అమెరికన్ కార్మికులను నియమించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. విదేశీ ఉద్యోగులను నియమించుకొని కొందరు ఈ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేశారని అబాట్ ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో అమెరికన్ కార్మికులను తొలగించి మరీ తక్కువ వేతనాలు తీసుకునే హెచ్-1బీ ఉద్యోగులను యజమానులు నియమించుకున్నారని పేర్కొన్నారు.
కాలిఫోర్నియా తర్వాత అమెరికాలో అత్యధిక హెచ్-1బీ హోల్డర్లు ఉన్న రాష్ట్రం టెక్సాస్. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం.. 2025లో 6,100 మంది యజమానుల వద్ద ఉద్యోగం చేసేందుకు 40వేల మందికి పైగా హెచ్-1బీ వీసాలు మంజూరయ్యాయి. టెక్సాస్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1200 మంది పనిచేస్తున్నారు.






