అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ : ఎలక్టోరల్ కాలేజీ ప్రకటన
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచినట్లు ఎలక్టోరల్ కాలేజీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బైడన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరినట్లు ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నించినా.. ఈ దేశంలో చట్టం, రాజ్యాంగం, ప్రజల ఆకాంక్షలు నెరవేరినట్లు బైడెన్ అన్నారు. చాన్నళ్ల క్రితమే ఈ దేశంలో ప్రజాస్వామ్య జ్వాలను వెలగించారని, అది మహమ్మారి అయినా లేక అధికార దుర్వినియోగమైనా ఆ జ్వాలను ఆర్పలేరని బైడెన్ తెలిపారు. దిలావేర్ నుంచి ప్రసంగం చేసిన ఆయన… ట్రంప్ వైఖరిని తప్పుపడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ట్రంప్ కోర్టుకు వెళ్లారని, ఇలాంటి స్థితి గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. కానీ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఆ ప్రయత్నాలను తిప్పికొట్టిందని బైడెన్ అన్నారు.
అమెరికా ప్రజాస్వామ్యం ఎన్నో అవరోధాలను, బెదిరింపులను ఎదుర్కొన్నదని, కానీ మన ప్రజాస్వామ్యం బలంగా ఆ ఒడిదిడుకులను ఎదుర్కొన్నట్లు బైడెన్ తెలిపారు. అమెరికా చరిత్రలో పేజీని మార్చాల్సిన సందర్భంగా వచ్చిందన్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎలక్టోరల్ కాలేజీ ప్రకటన బైడెన్‌కు కీలకమైంది. అమెరికా ఎన్నికల విధానంలో ఓటర్లు నేరుగా ఎలక్టర్స్ ను ఎన్నుకుంటారు. వారంతా కొన్ని వారాల తర్వాత దేశాధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఓటేస్తారు. నవంబర్ 3వ తేదీన జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో జోసెఫ్ బైడెన్ 306 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను గెలుచుకున్నారు. ట్రంప్‌కు కేవలం 232 ఓట్లు వచ్చాయి.






