భారత్ అమెరికాకు బలమైన భాగస్వామి : జాన్ కిర్బీ
భారతదేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా వర్ధిల్లుతోందని, ఢిల్లీని సందర్శించిన వారెవరైనా ఈ సంగతిని స్వయంగా వీక్షించవచ్చని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ఉద్ఘాటించింది. భారత్‌లో ప్రజాస్వామ్య పటిష్టత గురించిన అనుమానాలను అలా పటాపంచలు చేసింది. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల అమెరికాలో అధికారికంగా పర్యటించనున్న నేపథ్యంలో శ్వేతసౌధం ప్రకటన ప్రాముఖ్యం సంతరించుకుంది. మోదీ పర్యటన భారత్-అమెరికాల మధ్య మరింత పటిష్టమైన స్నేహం, భాగస్వామ్యాలకు బాటలు వేస్తుందని ఆశిస్తున్నట్లు శ్వేతసౌధంలో జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్ కిర్బీ తెలిపారు. భారత్ ఇప్పటికే అనేక స్థాయుల్లో అమెరికాకు బలమైన భాగస్వామి అని చెప్పారు. క్వాడ్‌లో భాగస్వామిగా భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, రెండు దేశాల మధ్య వాణిజ్యం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ద్వైపాక్షికంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారత్, అమెరికాలు కీలక భాగస్వాములుగా వ్యవరిస్తున్నాయని వెల్లడించారు.






