Lagacharla: అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్లను అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ ప్రాంతానికి అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకొస్తాం. పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. తెలంగాణ నోయిడా గా అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్ల (Lagacharla) పారిశ్రామికవాడను తీర్చిదిద్దుతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. కొడంగల్ శివారు ఎన్కేపల్లి వద్ద హరేకృష్ణ సంస్థ – అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ భవన నిర్మాణ పనులకు మంత్రులు దామోదర రాజనరసింహ (Damodar Raja Narasimha) , వాకిటి శ్రీహరి తో కలిసి సీఎం రేవంత్ భూమి పూజ నిర్వహించారు. అల్పాహారం తయారీకి హరేకృష్ణ మిషన్ నిర్వహిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలో రూ.103 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొడంగల్‌ను (Kodangal) మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రణాళికలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు లగచర్లలో భూ సేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి, అమాయక రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయించారని, దాంతో వారు అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్నారని గుర్తు చేశారు. తాము భూ నిర్వాసితులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని, దాంతో, లగచర్ల, హకీంపేట, పోలేపల్లిల్లో 3000-4000 ఎకరాల భూములను రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారని తెలిపారు. సున్నం గనులు కొడంగల్ నియోజకవర్గంలో ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు కర్ణాటకలో ఉన్నాయని, త్వరలో ఇక్కడే సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.
అక్షయ పాత్ర ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తున్నాం. ఏ విద్యార్థి ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండాలని అన్న, అమ్మలా ఆలోచించి ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందుకే సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి భూమి పూజ చేశాం. ఫలితంగా ఈ ఏడాదే ప్రభుత్వ పాఠశాలల్లో 5000 మంది విద్యార్థులు పెరిగారు అని వివరించారు. నెహ్రూ స్ఫూర్తితో విద్య, సాగునీటి రంగాలను తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యాలుగా తీసుకున్నామన్నారు. గత 70 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన కొడంగల్‌ను 2034 నాటికి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది తన లక్ష్యమన్నారు. విద్య ఒక్కటే తరగని ఆస్తి అని, తెలంగాణ పున: నిర్మాణంలో ఇక్కడి పిల్లలను భాగస్వాములను చేసేందుకు రూ.5000 కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంప్‌సను నిర్మిస్తున్నామని చెప్పారు. ఉస్మానియా క్యాంప్‌సలో కూడా లేని విభాగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు.






