Tollywood: సంక్రాంతికి తెలుగు సినిమా శోభ.. విడుదలైన ఐదు సినిమాలలో నెంబర్ వన్ స్థానం ఎవరిది?
నెంబర్ వన్ స్థానంలో ఈ సంక్రాంతి మొనగాడు మన శంకర వరపస్రాద్ గారు
ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘‘మన శంకర వరప్రసాద్ గారు ‘‘ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఫ్యామిలీ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ఆదరణ పొంది, సంక్రాంతి పండగకు నెంబర్ వన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా కథలో ప్రధానంగా తండ్రి బిడ్డల సెంటిమెంట్, భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, మామ అల్లుడి మధ్య హిలేరియస్‌గా సాగే సాలిడ్ కామెడీ ఎపిసోడ్స్ అన్ని వర్గాల ఆడియెన్స్ ని థియేటర్స్ లో అలరించాయి. ఇక మెగాస్టార్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న వింటేజ్ కామెడీ అండ్ మాస్ వైబ్స్‌ని ఇందులో దర్శకుడు పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేశారు. మెగాస్టార్ స్వాగ్ గాని ఎమోషన్స్ గాని ముఖ్యంగా కామెడీ టైమింగ్ ఇందులో అదిరిపోయాయి. మెగాస్టార్ నుంచి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా వెంకీ మామ ఎపిసోడ్స్ అయితే ఆడియెన్స్ కి బోసన్. ఇక ఇద్దరి కాంబినేషన్ లో సీన్స్ అయితే ట్రీట్ గా నిలుస్తాయి. దర్శకుడు అనిల్ రావిపూడి కథను ట్రైలర్లోనే రివీల్ చేసి, సినిమా మొత్తం చూపిస్తాననే నమ్మకాన్ని కలిగించారు. ఇద్దరు సీనియర్ సూపర్ స్టార్స్ ని తన చేతికిచ్చి ఒక సాలిడ్ ఎంటర్టైనర్ తీయమని ఫ్రీడమ్ ఇస్తే ఎలా ఉంటుందో అందుకు కావాల్సిన సామాగ్రి అంతా కూడబెట్టి ఈ సంక్రాంతికి ఇళ్లలో చేసుకునే కలగూర తరహాలో ఫ్యామిలీ ప్యాకెడ్ ఎంటర్టైనర్ గా, సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్ లేకుండా మంచి ఎంటర్టైనింగ్ గా ప్రజెంట్ చేసాడు అనిల్ రావిపూడి.
అనిల్ రాసిన స్క్రిప్ట్ అద్భుతం: విక్టరీ వెంకటేష్
ఏ సినిమాలో అయినా ఇద్దరు స్టార్ హీరోలను ప్రజెంట్ చేయడంతో అనవసరమైన వివాదాలకు దారి తీస్తుంది. కాని అనిల్ చిరంజీవి ఫాన్స్‌ని గాని, నా ఫాన్స్‌ని గాని హార్ట్ చేయకుండా ఎంతో బ్యాలన్స్ గా స్క్రిప్ట్ రాసుకున్నాడు. చిరంజీవి నేను నిజ జీవితంలో ఎలా ఫ్రెండ్స్ గా ఉంటామో స్క్రీన్ పై అదే విధంగా ప్రజెంట్ చేసాడు. హాట్స్ ఆఫ్ అనిల్. మా ఇద్దరి పై షూటింగ్ జరిపినన్ని రోజులు జీవితంలో మరిచిపోలేని రోజులు అవి అంత బాగా గడిచాయి. అందుకే సినిమా క్లైమాక్స్‌లో మళ్లి ఎప్పుడూ కలుద్దాం అంటే నేవేప్పుడు అప్పుడు అన్నాను.
సినిమా చూసి విడాకులు తీసుకోవాలనుకున్న జంట కలవడం సంతోషం: చిరంజీవి
ఇటీవల ఓ శాటిలైట్ ఛానల్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా చూసి మూడు నెలల నుండి విడాకులు తీసుకోవాలనుకున్న ఓ జంట మీమాంస లో వుండి, విడుదలైన 4 నాలుగు రోజుల్లో సినిమా చూసి….తమ తమ తప్పులు తెలుసుకుని, వాళ్ళకు వాళ్ళు అర్ధం చేసుకుని మళ్ళి కలుసుకున్నారంట! ముఖ్యంగా సినిమాలోని మదర్ సెంటిమెంట్ తన కోడలుతో భార్య భర్తల మధ్య తగువుటలో మూడో వ్యక్తి ప్రమేయం వుండకూడదు వాళ్ళకు వాళ్ళే సమస్యను పరిస్కరించుకోవాలనే సన్నివేశం వాళ్ళకు స్ఫూర్తి నిచ్చిందంట. దాని ఇంపాక్ట్ తో ఈ రోజుల్లో విడాకులు తీసుకోవడం ఎంత ఈజీ అయ్యిందో? కాస్త కలయ తిరిగినవారిని ఎవరిని అడిగిన చెపుతారు. కలిసి వుండటం అయినా, విడిపోవడం అయినా ఎవరు ఎవరిని కన్విన్సు చేసే రోజులు కావు. తల్లి దండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, బందువులు ఆఖరికి కోర్ట్, పోలీస్ స్టేషన్ రాజీలతో జరిగే పనికాదు. అలాంటిది సినిమా చూసి ఒక జంట కలిసి ఉండాలనే నిర్ణయం తీసుకోవడం సినిమా మాధ్యమం అలాంటిది.
ఇక సినిమా విషయానికొస్తే….ముఖ్యంగా మహిళలు భాగా ఆదరిస్తున్నారు. ఇటివల నా భార్య సురేఖ ఈ సినిమా చూసి ‘చాలా కాలం తరువాత మీరు నటించి ఈ సినిమా చూసి నవ్వు ఆపుకోలేక పోయాను’ అంది. అంతగా ఆమెకు నచ్చేసింది, నాకు లోపల ఓ పక్క ఏమంటుందో అన్న మీమాంస లో వుండగా..మళ్లి ఓ సారి సినిమా చుస్తాననడంతో ఇది మహిళకు బాగా నచ్చింది అని రూడి చేసుకున్నా.సెకండ్ హాఫ్ లో వెంకటేష్ ఎంట్రీ సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది ఆయనొక స్టారు, నేను ఎక్కడా తగ్గిపోతానని గాని, నాకు నేను ప్రొజెక్ట్ చేసుకోవడం ప్రయత్నం గాని ఏమి చేయలేదు. నేను ఎక్కడా తగ్గి వుండాలంటే అక్కడ అలా వున్నాను, అలాగే వెంకిని వేలివేట్ చేసుకున్నాను. వెంకితో కలిసి నటించడం అనే కంటే ఒకే కాలేజీలో చదువుకుని పదేళ్ళ తరువాత మళ్లి కలుసుకున్న స్నేహితులం అనిపించింది. రామ నాయుడు గారు నన్ను రాజా అని పిలిచేవారు ఒక సారి ‘రాజా మా వాడితో కలిసి ఎప్పుడూ సినిమా చేస్తావ్ణ అని అడిగారు ఇద్దరికి సంబంధించిన మంచి కథ దొరికితే ఎందుకు చేయం రెడీ చేయించండి అన్నాను. ఇన్నాళ్ళకు మా ఇద్దరిని అనిల్ కలిపాడు థాంక్స్ టూ అనిల్.’’ అన్నారు.
సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రెండవ చిత్రం నారీ నారీ నడుమ మురారి
శర్వా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం సంక్రాంతి బరి లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రెండవ చిత్రంగా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. 1990 లో బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్ ని 2026లో శర్వా మరో సారి బ్లాక్ బస్టర్ తో రిపీట్ చేసాడు. ‘నారి నారి నడుమ మురారి’ బాక్సాఫీస్ కలెక్షన్ రెండో రోజు: 200 శాతం వృద్ధి, మూడో రోజుకు రూ.5 కోట్ల వసూళ్లు సాధించింది.
శర్వానంద్ కి ఫ్యామిలీ హీరోగా మంచి పేరు ఉంది. మినిమమ్ గ్యారంటీ హీరోగా మంచి గుర్తింపు కూడా ఉంది కానీ.. తనలోకి ఫ్యామిలీ స్టార్‌ని పక్కనపెట్టి.. ప్రయోగాల వైపు వెళ్లి బోల్తా కొట్టారు శర్వా. ఈ సంక్రాంతి పండుగ నాడు ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో మంచి ఆత్రేయపురం పూతరేకులు లాంటి సినిమాని రుచి చూపించి శర్వా ఈజ్ బ్యాక్ అనిపించారు. పండుగ పూట ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమా అందించారు. నేలవిడిచి సాము చేయకుండా.. తన నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఏం కోరుకుంటారో అదే చాన్నాళ్ల తరువాత తిరిగి ఇచ్చేశారు. తనలోకి కామెడీ టైమింగ్‌కి మరింత పదును పెడుతూ.. నారీ నారీ నడుమ మురారిగా ఇద్దరి భామల మధ్య నలిగిపోయే పాత్రతో నవ్వుల విందు అందించారు శర్వా. ‘నారీ నారీ నడుమ మురారి’ కుటుంభ సమేతంగా చూడాల్సిన సినిమా! చివరిగా విడుదలైన శర్వా సినిమా కూడా సంక్రాంతి పండక్కి చక్కని నవ్వుల విందు అందించిన చిత్రంగా నిలబడిరది. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన మాత్రమే లభించినప్పటికీ, రెండో రోజు మాత్రం సినిమాకు అద్భుతమైన వృద్ధి కనిపించింది. కారణం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకుడి మౌత్ టాక్ తో రోజు రోజుకు కలెక్షన్స్ థియేటర్ ల సంఖ్య పెంచుతూపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల తొలి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోయినా, రెండో రోజు ప్రేక్షకుల స్పందన గణనీయంగా పెరిగింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద భారీ జంప్ నమోదైంది.బాక్సాఫీస్ వివరాలు (రెండో రోజు)‘నారి నారి నడుమ మురారి’ మొదటి రోజు సుమారు రూ.70 లక్షల వసూళ్లతో ప్రారంభమైంది. అయితే రెండో రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 200 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రారంభ అంచనాల ప్రకారం, రెండో రోజు ఒక్క రోజే సుమారు రూ.2.1 కోట్లు వసూలు చేసింది.ఈ రెండు రోజులను కలిపి చూస్తే, ‘నారి నారి నడుమ మురారి’ మొత్తం వసూళ్లు దాదాపు రూ.2.8 కోట్లకు చేరుకున్నాయి.ఇక ఈ చిత్రం విడుదలైన మూడవ రోజుకు(ఈ వార్త ప్రచరించే నాటికి) వచ్చేసరికి 5 కోట్లకు చేరింది.
ముందే చెప్పాను బ్లాక్ బస్టర్ హిట్ అని: హీరో శర్వా
‘‘ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. హిట్ కొడతానని చెప్పాను. చెప్పి కొట్టాను. ఇది గర్వంతోనో పొగరుతో మాట్లాడటం లేదు. చాలా హంబుల్ గా చెప్తున్నాను. హిట్టు కొడతానని అంత నమ్మకంగా చెప్పడానికి కారణం ఈ కథ. రామ్, నందు, భాను వాళ్లు రాసిచ్చిన కథ మొదటి రోజు నుంచే నాకు ఎంతో నమ్మకాన్ని కలిగించింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా బ్లాక్ బస్టర్ అవుతుందని అనిల్ సుంకర గారికి ముందే చెప్పాను. సంక్రాంతి అనేది రెవెన్యూ పరంగా 40, 50% పెరుగుతుంది. నేను కూడా సంక్రాంతికి రావాలనుకున్నాను. దాన్ని నెరవేర్చింది అనిల్ గారే. రామ్ అబ్బరాజు లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీకి కావాలి. తను ప్రొడ్యూసర్ డైరెక్టర్. నాకు కథ ఎలా చెప్పాడో అంతకంటే అద్భుతంగా తీశాడు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాను. ఆ హిట్ ఇచ్చిన రామ్ కి థాంక్ యూ. భాను నందు అద్భుతంగా రాశారు. ఎక్కడ బోర్ కొట్టించకుండా అద్భుతమైన మాటలు రాశారు. యువరాజ్ చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ చేశారు. అనిల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో అందరూ కూడా ఆయన్ని మంచి ప్రొడ్యూసర్ అంటారు. ఆయన ఒక బ్రదర్ లాగా నిల్చున్నారు. ఈ సినిమాని ఎంత కష్టపడి తీశారో ఎంత కష్టపడి రిలీజ్ చేశారో నాకు తెలుసు. మా జర్నీ కొనసాగుతుంది. దిల్ రాజుగారి సపోర్టు నాకు ఎప్పుడు ఉంటుంది. ఆయన తక్కువ థియేటర్లు అని చెప్పారు. మాకు తెలిసే రిలీజ్ చేశాం. మంచి సినిమా ఇచ్చాం, మంచి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వారి చేతుల్లో పెడుతున్నాను వాళ్ళు చూసుకోవాలి. ఇలాంటి గోల్డెన్ హాండ్స్ ఉన్నప్పుడు నాకు ఆలోచించి టెన్షన్ పడాల్సిందేమీ లేదు. సంక్రాంతికి అన్ని సినిమాలు బాగా ఆడుతున్నాయి. మన బాస్ సినిమా అద్భుతంగా ఆడుతుంది.అలాగే అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి సినిమా, అలాగే వచ్చిన సినిమాలు అన్నిటికీ ఆల్ ది వెరీ బెస్ట్.’’ అన్నారు.
నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ ‘అనగనగా ఒక రాజు’
సితార బ్యానర్లో ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత ఆ స్థాయి చిత్రం ‘అనగనగా ఒక రాజు’. యంగ్ హీరోస్ స్క్రీన్ మీద చాలా ఎనర్జిటిక్‌గా కనిపించే వాళ్లలో నవీన్ పొలిశెట్టి ఒకరు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాల్లో నవీన్ చేసిన కామెడీ ఆడియన్స్‌కి విపరీతంగా నచ్చింది.’మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ విడుదలైన మూడేళ్ళ తరువాత ఇలా ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో జనవరి 14న సంక్రాంతి బరిలోకి దిగాడు నవీన్. ట్రైలర్, సాంగ్స్‌తోనే ఇది పక్కా పండగ ఎంటర్టైనర్ అనే క్లారిటీ మూవీ టీమ్ ఇచ్చింది. మరి ఆ అంచనాలన్నిఏ మాత్రం మిస్ అవ్వకుండా రాజంటే రాజేనని ఈ నవీన్ రాజు సంక్రాంతి బరిలో నెంబర్ 3 స్థానం తో జండా పాతాడు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా నవ్వుల రైడ్‌గా సినిమా ఉంది. తాను రిచ్చే రిచ్చు అంటూ నవీన్ పోలిశెట్టి ఇచ్చే బిల్డప్‌లు, కవరింగ్‌లతో మొదలైన ఈ నవ్వులు.. హీరోయిన్ని పడేయడానికి మొదలైన ఆపరేషన్ చారుతో ఇంకా రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా పెద్దిపాలెం బీచ్‌ని గోవాగా మార్చిన సీన్.. హీరోయిన్‌తో కలిసి చేసి పారా గ్లైడిరగ్ సీన్ థియేటర్లో నవ్వులు పూయించాయి. ఆ సీన్లలో నవీన్ కామెడీ అదిరిపోయింది. ఇక పెళ్లి అయిన తర్వాత హీరోకి ఒక నిజం తెలియడంతో నవీన్‌కి షాక్.. ఆడియన్స్‌కి బ్రేక్ అంటూ ఇంటర్వెల్‌కి మంచి బ్యాంగ్ ఇచ్చారు. సెకండాఫ్ మొత్తం ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారం.. ప్రజా సమస్యలు అంటూ నవీన్ చేసిన కామెడీ హంగామా కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ముఖ్యంగా సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఎక్కడా కామెడీ డోస్ తగ్గకుండా జాగ్రత్తప్పడ్డారు. ఇక ప్రీ క్లైమాక్స్‌లో ఇచ్చిన ఎమోషనల్ టర్న్ కూడా సినిమాకి ప్లస్ అయింది. అప్పటివరకూ కామెడీగా సాగిన కథని చిన్న ఎమోషనల్ టర్న్‌తో సీరియస్‌గా మార్చారు. కానీ చివరిలో మళ్లీ నవ్వులతోనే శుభం కార్డు వేశారు. ఎప్పుడూ కథలో కొత్తదనం కోరుకునే నవీన్.. రొటీన్ సినిమా చేశాడేంటి అని కొంతమంది నిరాశ చెందొచ్చు. కానీ సంక్రాంతి పండగ సినిమా కావడం సినిమా సందడి సందడి గా ఉండాలనుకోవడంతో మంచి వినోదాత్మక చిత్రంగా అందరిని అలరించింది.
నిర్మాత నాగవంశీ ముఖంలో చిరునవ్వు సంతోషాన్ని ఇచ్చింది: నవీన్ పొలిశెట్టి
‘‘కథానాయకుడిగా నాకిది కేవలం నాలుగో సినిమా. నా మొదటి సంక్రాంతి సినిమా. పోటీలో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మా సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతప్ఞతలు. సితార ఎంటర్టైన్మెంట్స్ అనేది బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్. ఎన్నో మైలురాయి లాంటి చిత్రాలను అందించారు. అలాంటి సంస్థ నుంచి ఇటీవల ఒకట్రెండు సినిమాలు ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇలాంటి తరుణంలో ‘అనగనగా ఒక రాజు’ రూపంలో ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ ను అందించడం.. మా అందరికీ సంతోషాన్ని కలిగించింది. ముఖ్యంగా నాగవంశీ గారి ముఖంలో చిరునవ్వు చూడటం సంతోషాన్ని ఇచ్చింది. ఆయన ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. మా గురువు గారు త్రివిక్రమ్ గారు, చినబాబు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. త్రివిక్రమ్ గారు, చినబాబు గారు ఈ సినిమా విషయంలో మమ్మల్ని నమ్మి ఎంతగానో ప్రోత్సహించారు. మేము చెప్పింది నమ్మి ఏ ఎపిసోడ్లు అయితే సినిమాలో ఉంచడానికి వారు అంగీకరించారో.. ఇప్పుడు ఆ ఎపిసోడ్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నా సినిమాలలో వినోదానికి పెద్ద పీట వేస్తుంటాను. అయితే ఇందులో వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను కూడా అందించాలి అనుకున్నాము.
ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ని ఎంతలా ఎంజాయ్ చేశారో, ఎమోషనల్ సీన్లకు అదే స్థాయిలో చప్పట్లు వర్షం కురిపించారు. మా కథ అన్ని వర్గాలు ప్రేక్షకులకు చేరువ అయిందని మాకు అప్పుడే అనిపించింది. త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల ఏదో శక్తి ఉందని. నా వెనకున్న శక్తి ప్రేక్షకులే. నా సినిమాలను మోసేది ప్రేక్షకులే. ఒక్క ఛాన్స్ అంటూ తిరిగే నాకు.. వరుసగా నాలుగు విజయాలు అందించిన ప్రతి తెలుగు కుటుంబానికి పేరుపేరునా కృతప్ఞతలు. ఇక ముందు కూడా మిమ్మల్ని అలరించడానికి నా శక్తికి మించి కృషి చేస్తాను. ఒక రైటర్ కి కానీ, ఆర్టిస్ట్ కి కానీ, డైరెక్టర్ కి కానీ నమ్మి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే అవుట్ పుట్ ఇలా ఉంటుంది. మమ్మల్ని నమ్మి మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన నాగవంశీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.’’ అన్నారు.
ప్రేక్షకులు పెడచెవిన పెట్టిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’
కొన్నేళ్లుగా సరైన విజయం లేక బాగా ఇబ్బంది పడుతున్నాడు రవితేజ. మాస్ సినిమాలతో విసుగెత్తించేసిన ఆయన ‘మాస్ రాజా’ అనే బిరుదును కూడా పక్కన పెట్టేసి ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రమే.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. నేను శైలజ, వున్నది ఒకటే జిందగీ, చిత్రలహరి చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అయ్యింది.విడుదలైన సంక్రాంతికి విడుదలైన అయిదు చిత్రాలలో ఈ చిత్రానికి నంబరింగ్ ఇవ్వలేము, కారణం నిర్మాతకు బ్రేక్ ఈవన్ కూడా నోచుకోలేదు ఈ సినిమాకైనా బడ్జెట్ పరంగా ప్రస్తుతం వస్తున్న వసూళ్లు చూస్తుంటే నిర్మాత ఏ మేరకు నష్టపోయాడో ఊహించవచ్చు. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి 3 రోజుల్లో మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ 3 రోజుల్లో ఇండియా నెట్‌గా సుమారు రూ. 7.1 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా (వరల్డ్‌వైడ్): మొత్తం గ్రాస్ కలెక్షన్ సుమారు రూ. 9.65 కోట్లు మాత్రమే వసూలు చేసిందని పరిశ్రమ బోగట్ట.
ఇద్దరు పెళ్ళాల కథలతో 80 దశకంలో శోభన్ బాబుతో ఇల్లాలు, కార్తీకదీపం, ఇల్లాలు ప్రియురాలు వంటి సినిమాలు పెద్ద సక్సెస్‌లు సాధించాయి. 90వ దశకంలో కూడా ఇలాంటి కథలు చాలానే చూశారు తెలుగు ప్రేక్షకులు. అల్లరి మొగుడు.. ఏవండీ ఆవిడ వచ్చింది.. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.. ఆవిడా మా ఆవిడే.. ఇలా ఆ తరహా కథలతో వచ్చిన సినిమాలు చాలానే విజయవంతం అయ్యాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రథమార్ధం మంచి ఊపులోనే సాగుతుంది. కథను నేరుగా స్పెయిన్‌లో మొదలు పెట్టిన దర్శకుడు మొదటి 20 నిమిషాలు మానసగా ఆషికా రంగనాథ్ అందాల్లో రామసత్యతో పాటు, ప్రేక్షకుడినీ ముంచేస్తాడు. మానసకు అసిస్టెంటుగా సత్య చేసే కామెడీ ఒకవైపు మెప్పిస్తుంటే… మానస సొగసుల్లో రామసత్య రొమాన్స్ ఆడియాన్ని ఎంగేజ్ చేస్తాయి. అలా కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు… హైదరాబాద్‌లో రామసత్య భార్య బాలామణిని చూపించి… పాత్రల మధ్య కాన్ఫ్లిట్ ని రైజ్ చేశాడు. భార్యా భర్తల మధ్యలోకి ప్రేయసి రావడంతో అక్కడి నుంచి హీరో పడే తంటాల మధ్య.. కన్ఫ్యూజింగ్ కామెడీతో సినిమాను నడిపించడానికి ప్రయత్నించాడు కిషోర్. ‘భర్త మహాశయులకు విజప్తి’ కానీ పూర్తి వినోదం స్థాయిని మాత్రం మించలేకపోయింది. ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
పెట్టుబడిలో సగం కూడా రాని అయోమయ పరిస్థితిలో ‘ది రాజాసాబ్’
2024లో ‘కల్కి 2898ఏడీ’తో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 2025లో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ కు సంబంధించిన ఎలాంటి సినిమా వస్తుందన్నా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా పండగే. దీంతో ఆయన్ని సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతి కానుకగా ‘ది రాజాసాబ్ణగా థియేటర్లలో అడుగుపెట్టారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోని ఆయన ఎలా డీల్ చేస్తాడోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణం లో ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం లో ఫస్ట్ టైమ్ హార్రర్ ఫాంటసీ కామెడీ జోనర్‌ని ట్రై చేశారు. పైగా ముగ్గురు హీరోయిన్లు, 400 కోట్ల భారి బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టి జి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి పండగ సీజన్లో మొదటి చిత్రంగా జనవరి 9న థియేటర్లలో అడుగు పెట్టాడు రాజా సాబ్. మరి ఈ చిత్రం పెట్టిన పెట్టుబడిలో సగం అయినా వసూలు చేసిందా లేదా? అంటే లేదు అని చెప్పొచ్చు ఈ చిత్రం విడుదలై ఇప్పటి( వ్యాసం రాసేనాటికి) వరకు వారం పూర్తి కావస్తున్న రెవిన్యూ పరంగా ప్రపంచ వ్యాప్తంగా 192 కోట్లు మాత్రమే వసూల్ చేయగలిగింది.
హర్రర్ కామెడీ చిత్రాలు చాలా కాలంగా వస్తూనే ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రభాస్ మొదటిసారి ఈ జోనర్ మూవీ చేయడం, ఫాంటసీ ఎలిమెంట్లు, రొమాన్స్ మేళవించడం, పూర్తి ఎంటర్టైన్మెంట్గా దీన్ని రూపొందించడం ఈ మూవీ కి పట్టిన పీడ. దీనికితోడు చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ఇందులో కామెడీ చేయడంతో సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ఆ అంచనాలు తారుమారు అయ్యాయి. అంటే ఆ విషయంలో సరైన నిర్ణయం కాదనిపించింది. చాలా వరకు డిజప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. అయితే టెక్నీకల్‌గా అయినా బాగుందా అంటే… అక్కడకూడా నిరాశే ఎదురైంది. ఎంచుకున్న కథ కొత్తగా బాగుంది. ఇలాంటి కథతో సినిమాలు రాలేదని చెప్పొచ్చు. అంతేకాదు ఇందులో మెయిన్ ప్లాట్‌ని చూపించిన తీరు కూడా కొత్తగా ఉంటుంది. ఎంగేజింగ్‌గా ఉంటుంది. సినిమా ఫాంటసీ హర్రర్ కామెడీ అన్నారు, కానీ ఎక్కువగా సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్లు కూడా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. కానీ సెకండాఫ్‌లో కాస్త నవ్వించింది. మెప్పించింది. సైకలాజికల్ అంశాలు చూపించిన తీరు బాగున్నాయి. మొత్తానికి క్లైమాక్స్ తో బాగానే హడావుడి చేశారు.పార్ట్ 2 వుంటుందో లేదో తెలియదు కాని లీడ్ కూడా ఇచ్చేసారు. ఓవరాల్‌గా మూవీలో ఫస్టాఫ్‌లో స్లోగా అనిపిస్తుంది. సెకండాఫ్ కొంత కవర్ చేశారు. అయితే చాలా చోట్ల కామెడీ సీన్లు తేలిపోయాయి. ఫస్టాఫ్‌లో ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఇరికించినట్టుగానే ఉన్నాయి. చాలా లాజిక్ లెస్‌గా అనిపిస్తాయి. ఎంత సేపు అక్కడక్కడే తిరుగుతుంటుంది. ముందుకు కదలదు. అదే సమయంలో లవ్ ఎపిసోడ్లు కూడా కనెక్ట్ అయ్యేలా లేవు. ఎంతో భారీ అంచనాలతో భారీ టికెట్ కొని థియేటర్‌కి వెళ్ళిన ప్రేక్షకుడికి ‘ది రాజాసాబ్ణ మహమ్మద్ బీన్ తుగ్లక్ లాగ అర్ధం లేని తీర్పు ఇచ్చాడు.






