Trump: 1బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందే.. బీబీసీకి ట్రంప్ భారీ షాక్.. !
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి ట్రంప్ మరో షాకిచ్చారు. 2021లో తన క్యాపిటల్ హిల్ ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా ఎడిట్ చేసి ప్రసారం చేసినందుకు గానూ బీబీసీపై న్యాయపరమైన యుద్ధాన్ని ప్రకటించారు. ట్రంప్ ఏకంగా 1 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 8,300 కోట్లు) పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసి ప్రసారం చేసినందుకు గానూ తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ బీబీసీ అధికారులు తమ తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరారు. అంతటితో ఆగకుండా కొందరు అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. అయినా ట్రంప్ కోపం ఏమాత్రం చల్లారలేదు. తమకు పరిహారంగా ఏకంగా బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లు) చెల్లించాలని కోరుతూ.. బీబీసీకి లేఖ రాశారు.
2021 జనవరి 6వ తేదీన వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌పై దాడి కలకలం రేపింది. అయితే ఆ సమయంలో ట్రంప్ చేసిన ఓ ప్రసంగం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ముఖ్యంగా ట్రంప్ సుమారు గంటపాటు చేసిన ప్రసంగంలో కొంత భాగాన్ని బీబీసీ తన పనోరమ డాక్యుమెంటరీలో ప్రసారం చేసింది. అందులో ట్రంప్ ఆందోళనకారులను శాంతియుతంగా పోరాడాలని చెప్పినప్పటికీ.. “క్యాపిటల్ హిల్‌కు వెళ్తున్నాం. మీతోపాటు నేనూ అక్కడికి వస్తున్నా. మనం పోరాడదాం. ఘోరంగా పోరాడదాం” అని చెప్పినట్లుగా బీబీసీ చూపించింది. దీంతో ట్రంప్ బీబీసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎడిటింగ్ తప్పిదంపై తీవ్ర విమర్శలు, ట్రంప్ నుంచి రాజకీయ ఒత్తిడి పెరగడంతో.. ప్రభుత్వ నిధులతో నడిచే బీబీసీ సంస్థకు చెందిన డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా వంటి ఉన్నతాధికారులు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ తప్పిదానికి బీబీసీ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పింది. అయితే ఈ చర్యలు సరిపోవని పేర్కొన్న ట్రంప్ న్యాయ బృందం.. తప్పుడు ప్రచారాలు చేసి ట్రంప్ పరువుకు భంగం కలిగించినందుకు గానూ బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. దీనికి సమాధానం ఇవ్వడానికి శుక్రవారం వరకు గడువు కూడా విధించినట్లుగా తెలుస్తోంది.
అంతేకాకుండా ట్రంప్ న్యాయవాది అలెజాండ్రో బ్రిటో బీబీసీకి రాసిన లేఖలో.. సవరణ చేసిన డాక్యుమెంటరీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ట్రంప్ న్యాయ బృందం నుంచి వచ్చిన ఈ లేఖను సమీక్షిస్తున్నట్లు బీబీసీ ధ్రువీకరించింది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మీడియా సంస్థపై అధ్యక్షుడు ఇంత భారీ మొత్తంలో దావా వేస్తామని బెదిరించడం, అంతర్జాతీయ మీడియా వర్గాల్లో, రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది.







