BRS: బీఆర్ఎస్ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేయాలి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ (KTR) జైలుకెళ్లడం ఖాయమని, తనకు ఆ నమ్మకముందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేశారు. అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అంటేనే కుటుంబ పాలన అని, వారి పాలనలో చోటుచేసుకున్న అక్రమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేయాలన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అక్రమాలు జరిగాయని, కాళేశ్వరం నుంచి చిన్న చిన్న ప్రాజెక్టుల వరకు ఎంతో అవినీతి జరిగిందన్నారు. వీటిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విచారణ చేయాలని, ఎందుకంటే వారు దోచుకుంది తెలంగాణ సొత్తు అని స్పష్టం చేశారు. తనకు ఆపరేషన్ జరిగినప్పుడు అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటే, కేటీఆర్ మాత్రం నువ్వు చావరా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారని మండిపడ్డారు. నేను చావను, నేను ఉంటాను. నాకేం కాదు, నీకే అవుతుంది అంటూ కేటీఆర్‌నుద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.






