Mascow: భారత్ కు రష్యా బంపర్ ఆఫర్.. మరింత తక్కువ ధరకు చమురు విక్రయాలు..!
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేలా రష్యాను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలివ్వకపోవడంతో.. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక అస్త్రాన్ని బలంగా సంధిస్తోంది. రష్యా చమురు దిగ్గజాలపై భారీగా ఆంక్షలు విధించింది. దీంతో రష్యా లాభదాయకంగా ఉన్న చమురు అమ్మకాలు కాస్తా ఒత్తిడికి లోనయ్యాయి.
ముఖ్యంగా రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్నెఫ్ట్ (Rosneft), లుకోయిల్ (Lukoil)లపై ఆంక్షలు అమల్లోకి రావటంతో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. దీంతో భారత్కు చమురు సరఫరా చేసే విధానం మారింది. ఇది మన రిఫైనరీలకు భారీ లాభాలను అందించే అవకాశం ఉంది.
రష్యా నుంచి భారత్కు సరఫరా అయ్యే ముడిచమురు (Russian Oil) ధరలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువకు చేరాయి. రాస్నెఫ్ట్, లుకోయిల్లపై అమెరికా ఆంక్షలు విధించాక లాభదాయకంగా ఉన్న అక్కడి చమురు వ్యాపారం తారుమారైంది. ప్రస్తుతం రష్యా ప్రధాన చమురు అయిన ఉరల్స్ను (Urals) డెలివరీ ఆధారంగా బ్రెంట్ ముడి చమురు ధర కంటే బ్యారెల్కు ఏడు డాలర్ల వరకు తగ్గింపుతో భారత రిఫైనరీలకు అందించడానికి సిద్ధమయ్యాయి. ఆంక్షలు లేనప్పుడు ఈ తగ్గింపు కేవలం మూడు డాలర్లుగా ఉండేది. ఈ కొత్త ఆఫర్ డిసెంబరులో లోడ్ చేసి, జనవరిలో భారత్కు చేరే చమురుకు వర్తిస్తుంది.
2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత నుంచి తక్కువ ధరల కారణంగా రష్యా చమురును భారత్ భారీగా కొనుగోలు చేస్తూ వచ్చింది. కానీ, నవంబర్ 21 నుంచి ఆంక్షలు అమల్లోకి రావటంతో భారతీయ రిఫైనరీలు రష్యా చమురు (Russian Oil) ఆర్డర్లను కొంతకాలం నిలిపివేశాయి. అయితే, ఈ వారంలో ఉరల్స్ చమురు ధర బాగా తగ్గడంతో భారత రిఫైనరీల వైఖరి మారింది. ఆంక్షలు లేని సంస్థల నుంచి చమురును కొనుగోలు చేయడానికి కొన్ని రిఫైనరీలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఐదో వంతు మాత్రమే ఆంక్షలు లేని సంస్థల నుంచి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.






