Whitehouse: అవసరమైన చోట మాత్రమే విదేశీ ఉద్యోగులు.. వైట్ హౌస్ క్లారిటీ..!
హెచ్ 1బీ వీసాపై ఆంక్షలు.. విదేశీ ఉద్యోగులపై నిఘా లాంటి కార్యక్రమాలతో దూకుడుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. నెమ్మదిగా తన స్వరం మార్చారు. తాము అత్యున్నత టెక్నాలజీ అవసరమున్న చోట మాత్రమే విదేశీ సాంకేతిక నిపుణులను అనుమతిస్తామన్నారు. మిగిలిన ఉద్యోగాలు అమెరికన్లకే దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై మాగా తీవ్రంగా విమర్శలు చేసింది. మాగా విమర్శలపై వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే, అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను రక్షించేందుకు ట్రంప్ కట్టుబడి ఉన్నారని పేర్కొంది.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) ఈ విషయంపై వివరణ ఇచ్చారు. ‘అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను వేరొకరితో భర్తీ చేయడాన్ని ట్రంప్ సమర్థించడం లేదు. అమెరికాలో తయారీ పరిశ్రమలను మెరుగుపరచాలని ఆయన భావిస్తున్నారు. అందులోభాగంగానే పలు దేశాలపై సుంకాలు విధించారు. వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇక, హెచ్-1బీ వీసా (H-1B visa)లపై ఆయన దృష్టిసారించారు. అమెరికాలో విదేశీ కంపెనీలు ట్రిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడంతో పాటు బ్యాటరీలు వంటి ప్రత్యేక ఉత్పత్తుల తయారీకి విదేశీ ఉద్యోగులను తీసుకురావాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఆ తర్వాత ఆయా కంపెనీలు విదేశీ ఉద్యోగుల స్థానాన్ని అమెరికన్లతో రీప్లేస్ చేయాలి. దేశంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయాలనుకునే కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని ఆయన ఇప్పటికే స్పష్టంచేశారు’ అని లీవిట్ తెలిపారు.
మొదటినుంచి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఉన్న ట్రంప్.. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు జారీ చేసే హెచ్-1బీ వీసాపై కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల ఈ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా గందరగోళానికి దారితీసింది. విదేశీ ఉద్యోగుల కారణంగా అమెరికన్లు అవకాశాలు కోల్పోవాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. అయితే, ఇటీవల దీనిపై ట్రంప్ స్వరం మారింది. హెచ్-1బీ వీసాలు జారీ చేయడాన్ని సమర్థించారు. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు ఉందని పేర్కొన్నారు. అమెరికాలోని కంపెనీల్లో బిలియన్ డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టే వారిని అనుమతించకపోతే తాము విజయం సాధించలేమని అంగీకరించారు. అయితే, విదేశీ ఉద్యోగులు అమెరికన్లకు నైపుణ్యాలు నేర్పించి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.






