శిక్షపడినా అధ్యక్షుడిగా పోటీ చేస్తా
తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారం, అర్థరహితమని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో తన విజయావకాశాలకు గండికొట్టేందుకే విచారణ చేపట్టారనీ, తనకు శిక్షపడినా పోటీ మాత్రం చేసి తీరుతానని స్పష్టం చేశారు. జార్జియా, ఉత్తర కరోలినాల్లో రిపబ్లికన్ల సదస్సుల్లో ఆయన ప్రసంగించారు. పదవి నుంచి దిగిపోయినప్పుడు పెద్దఎత్తున అధికారిక పత్రాలను తన ఇంటికి ట్రంప్ తీసుకుపోయినట్లు అభియోగాలు వచ్చిన విషయం తెలిసిందే. కోర్టుకు హాజరుకాబోతున్న ఆయన ఈ విచారణపై ఆయన మండిపడ్డారు. మా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ఒకదాని తర్వాత ఒకటిగా విచారణలు చేపడుతున్నారు. అమెరికా ప్రజల అభీష్టాన్ని అణిచివేయడం వారి ఉద్దేశం. ఇదంతా నా వెంట కాదు. మీ (ప్రజల) వెంట పడడమే. నన్ను వేధింపులకు గురిచేసినా ఎప్పటికీ వదిలేది లేదు అని తెలిపారు.






