Biden: ఉక్రెయిన్ కి భారీ సైనిక సాయం ప్రకటించిన బైడెన్
మరో 10 రోజుల్లో పదవి నుంచి వైదొలగనున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ (Ukraine)కు సుమారు 2.5 బిలియన్ డాలర్ల ( రూ.21 వేల కోట్ల ) భారీ మిలటరీ సాయం ప్రకటించారు. ఈ నిధులను త్వరత్వరగా ట్రంప్ (trump) పగ్గాలు అందుకోకమునుపే ఆ దేశానికి అందించేందుకు బైడెన్(Biden) యంత్రాంగం ఆగమేఘాలపై చర్యలు ప్రారంభించింది. ఇందులో 1.25 బిలియన్ డాలర్లు అధ్యక్షుడి అధికార పరిధిలోనివే. ఈ మేరకు రష్యా (Russia) పై పోరాడేందుకు అవసరమైన ఆయుధాలను వేగంగా సరఫరా చేయాలని నిర్ణయించింది. మరో 1.22 బిలియన్ డాలర్లను దీర్ఘకాలం అందించే ఆయుధాల ప్యాకేజీ ఉక్రెయిన్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఇనిషియేటివ్‌గా ఉద్దేశించింది. గరిష్ట స్థాయిలో సాధ్యమైనంత వేగంగా ఉక్రెయిన్‌కు సాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్ ఇంధన వనరులే లక్ష్యంగా రష్యా దాడులను తీవ్రతరం చేసిన వేళ అమెరికా ఈ సాయం ప్రకటించడం గమనార్హం.






