Biden: భారతీయులకు బైడెన్ శుభవార్త!
అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కనే యువతకు జో బైడెన్ (Biden) కార్యవర్గం ఓ శుభవార్త చెప్పింది. మరింత తేలిగ్గా ప్రత్యేక నిపుణులైన విదేశీయులను నియమించుకొనేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతోపాటు సులువుగా ఎఫ్-1(F-1) విద్యార్థి వీసాలను హెచ్-1బీ (H-1B) వీసా లుగా మార్చుకొనే అవకాశం కల్పించింది. ఇది లక్షల మంది భారతీయ వృతి నిపుణులకు ప్రయోజనం కల్పించనుంది.
హెచ్-1బీ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరిలోకి వస్తుంది. టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సాయంతో నియమించుకొంటుంటాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాలు ఈ వీసా నుంచి చాలా లబ్ధి పొందాయి. ఈ నేపథ్యంలో కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం నాన్‌ప్రాఫిట్, ప్రభుత్వేతర పరిశోధన సంస్థల నిర్వచనం, నిబంధనల్లో మార్పులు చేసింది. దీని ప్రకారం సంస్థలు అవసరాలకు తగినట్లు నియామకాలు చేసుకొని ప్రపంచ పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవచ్చు.






