ఐపీఎల్ క్రేజ్‌కు ‘పొలిటికల్’ బ్రేక్, 25 శాతం పడిపోయిన వ్యూయర్షిప్..!
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ (IPL 2026)కు ఈసారి రాజకీయాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సాధారణంగా వేసవి కాలంలో టీవీల ముందు కోట్లాది మందిని కట్టిపడేసే ఐపీఎల్, గత వారం రోజులుగా తన ప్రభావాన్ని కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం, గత వారంతో పోలిస్తే ఐపీఎల్ టీవీ వ్యూయర్షిప్ ఏకంగా 25 శాతం మేర తగ్గింది. మైదానంలో ఆటగాళ్లు సిక్సర్లతో హోరెత్తిస్తున్నా, స్క్రీన్ల ముందు మాత్రం ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఇప్పుడు అటు బీసీసీఐని, ఇటు ప్రకటనకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ వ్యూయర్షిప్ పతనానికి ప్రధాన కారణం దేశంలో నెలకొన్న రాజకీయ వేడి అని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో తళపతి విజయ్(Vijay) రాజకీయ ప్రవేశం, ఆయన ముఖ్యమంత్రి కావడానికి జరుగుతున్న నాటకీయ పరిణామాలు ప్రజల దృష్టిని పూర్తిగా అటువైపు మళ్లించాయి. తమిళనాట క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం అక్కడ నెలకొన్న హడావుడి వల్ల ప్రేక్షకులు స్పోర్ట్స్ ఛానళ్ల కంటే న్యూస్ ఛానళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. విజయ్ పార్టీ టీవీకే (TVK) మరియు స్టాలిన్ వ్యూహాల చుట్టూ తిరుగుతున్న చర్చలు ఐపీఎల్ రేటింగ్స్‌ను దెబ్బతీశాయి.
మరోవైపు, పశ్చిమ బెంగాల్‌తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా క్రికెట్ వినోదాన్ని పక్కకు నెట్టేశాయి. బెంగాల్లో బీజేపీ విజయం, అక్కడ మారుతున్న సమీకరణాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతో క్రికెట్ అభిమానులు కూడా రాజకీయ విశ్లేషణల వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే టీవీలో ప్రకటనలు ఇచ్చే బ్రాండ్ల సంఖ్య కూడా 30 శాతానికి పైగా తగ్గడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, ప్లేఆఫ్స్ మొదలైన తర్వాత మళ్లీ క్రికెట్ ఫీవర్ ఊపందుకుంటుందని ఐపీఎల్ నిర్వహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
