PAK vs SL: శ్రీలంకపై గెలిచినా.. వరల్డ్ కప్ నుంచి పాక్ అవుట్!
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భాగంగా పల్లెకెలె వేదికగా శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంకపై (PAKvsSL) పాకిస్థాన్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ గెలుపు పాక్‌కు ఎలాంటి ఆనందాన్ని మిగల్చలేదు. సెమీస్ చేరాలంటే శ్రీలంకను 147 పరుగులలోపు కట్టడి చేయాల్సిన మ్యాచ్‌లో పాక్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక 207 పరుగుల భారీ స్కోరు సాధించడంతో.. పాకిస్థాన్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక.. పోతూపోతూ పాక్‌ను కూడా ఇంటికి పంపించింది.
డెత్ ఓవర్లలో కుప్పకూలిన పాక్..
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు (PAKvsSL) ఓపెనర్లు ఫర్హాన్ (100), ఫకర్ జమాన్ (84) అదిరే శుభారంభం అందించారు. దాదాపు 16 ఓవర్ల పాటు క్రీజులో పాతుకుపోయిన ఈ ద్వయం శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసింది. తొలి వికెట్‌కు ఏకంగా 176 పరుగులు జోడించి 250 పరుగుల స్కోరు చేసేలా కనిపించారు. అయితే డెత్ ఓవర్లలో లంక (PAKvsSL) బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. సెంచరీ పూర్తికాగానే ఫర్హాన్ వెనుదిరగ్గా.. ఫకర్ జమాన్ తృటిలో శతకం చేజార్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లంతా వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేవలం 36 పరుగుల వ్యవధిలోనే పాక్ 8 వికెట్లు కోల్పోయి, నిర్ణీత 20 ఓవర్లలో 212/8 స్కోరుకే పరిమితమైంది.
లంక పోరాటం..
అనంతరం 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక (PAKvsSL) ఆదిలోనే తడబడింది. కమిల్ మిశ్రా (26), అసలంక (25) దూకుడుగా ఆడే యత్నంలో అవుట్ కాగా.. నిస్సాంక, మెండిస్, లియనాగే విఫలమయ్యారు. దీంతో శ్రీలంక 148 పరుగులలోపే ఆలౌట్ అవుతుందని, తాము సెమీస్ చేరతామని పాక్ సంబరపడింది. కానీ పవన్ రత్నాయకే (58), కెప్టెన్ షనక (76 నాటౌట్) పాక్ ఆశలపై నీళ్లు చల్లారు. ముఖ్యంగా షనక ఇన్నింగ్స్ పాక్ (PAKvsSL) శిబిరంలో వణుకు పుట్టించింది. చివరి రెండు ఓవర్లలో షనక విధ్వంసం సృష్టించాడు. 19వ ఓవర్లో 18 పరుగులు రాబట్టగా.. ఆఖరి ఓవర్లో విజయానికి 28 పరుగులు కావాలి. బంతిని అందుకున్న పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో షనక వరుసగా 4, 6, 6, 6 బాది స్కోరును సమం చేసేలా కనిపించాడు. కానీ ఆఖరి రెండు బంతులకు పరుగులేమీ రాకపోవడంతో పాకిస్థాన్ (PAKvsSL) ఊపిరి పీల్చుకుంది.
కివీస్‌కు పండుగ..
ఈ మ్యాచ్ (PAKvsSL) విజయంతో పాకిస్థాన్ 3 పాయింట్లు సాధించి న్యూజిలాండ్‌తో సమంగా నిలిచింది. కానీ నెట్ రన్‌రేట్‌లో పాక్ (-0.112) కంటే కివీస్ (+0.400) మెరుగైన స్థితిలో ఉండటంతో.. న్యూజిలాండ్ అధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గ్రూప్-2 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
