Team India: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. సెమీస్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ వాయిదా!
టీ20 వరల్డ్ కప్ తుది ఘట్టానికి చేరుకున్న వేళ గురువారం జరగనున్న ప్రతిష్టాత్మక సెమీ-ఫైనల్ సమరానికి భారత జట్టు (Team India) సన్నద్ధమవుతోంది. ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియం వేదికగా పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో మంగళవారం జరగాల్సిన భారత జట్టు నెట్ ప్రాక్టీస్ సెషన్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. దీనికి ప్రధాన కారణం.. ‘చంద్ర గ్రహణం’ (Lunar Eclipse).
గ్రహణ సమయంలో నెట్స్ వద్దు..
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారత (Team India) ఆటగాళ్లు మైదానంలో తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. అయితే మంగళవారం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమైన చంద్ర గ్రహణం సాయంత్రం 6:40 గంటల వరకు కొనసాగింది. సాధారణంగా గ్రహణ సమయంలో ఎలాంటి కీలకమైన పనులు లేదా శుభకార్యాలు ప్రారంభించడం మంచిది కాదన్న బలమైన నమ్మకం ఉంది. సరిగ్గా ఇదే సెంటిమెంట్‌ను భారత టీమ్ (Team India) మేనేజ్మెంట్ సైతం పాటించినట్లు తెలుస్తోంది. ఫైనల్ బెర్త్ కోసం ఇంగ్లాండ్‌తో తలపడే డూ ఆర్ డై సెమీస్ లాంటి మెగా ఫైట్‌కు ముందు.. జట్టుపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు (Negative vibes) పడకూడదని మేనేజ్మెంట్ భావించింది.
పాజిటివ్ మైండ్‌సెట్ కోసమే..
జట్టులోని (Team India) ఆటగాళ్లందరూ అత్యంత సానుకూల దృక్పథంతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలన్న ఉద్దేశంతోనే ప్రాక్టీస్ సమయాన్ని మార్చినట్లు సంబంధిత వర్గాలు జాతీయ మీడియాకు చెప్పాయి. “చంద్ర గ్రహణ కాలంలో ప్రాక్టీస్ ప్రారంభించడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. ముఖ్యంగా సెమీస్ లాంటి కీలక మ్యాచ్‌కు ముందు ఏ పనీ అశుభ సమయంలో మొదలుపెట్టకూడదని మేనేజ్మెంట్, ఆటగాళ్లు ఉమ్మడిగా నిర్ణయించుకున్నారు. అందుకే ప్రాక్టీస్ సెషన్‌ను ఒక గంట వాయిదా వేయడం జరిగింది” అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో గ్రహణం పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత సాయంత్రం 6:40 గంటల తర్వాతే భారత స్టార్ (Team India) ఆటగాళ్లు వాంఖడే మైదానంలో అడుగుపెట్టి తమ ముమ్మరంగా సాధన చేశారు.
ఇవి కూడా చదవండి
