IND vs NZ: టైటిల్ వేటలో టీమిండియా.. న్యూజిలాండ్‌తో అమీతుమీ!
ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు, వరుసగా రెండోసారి కప్పును ముద్దాడేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు (ఆదివారం) జరగనున్న మెగా ఫైనల్లో (INDvsNZ) సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సేన.. బలమైన న్యూజిలాండ్‌తో చావోరేవో తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తలపడలేదు. నేరుగా ఫైనల్ పోరులోనే తలపడుతుండటంతో మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
బ్యాటింగ్ ఓకే.. బౌలింగే టెన్షన్!
భారత జట్టు బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. సంజూ శాంసన్ భీకర ఫామ్‌తో చెలరేగుతుండగా.. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, తిలక్ వర్మలు అద్భుత టచ్‌లో ఉన్నారు. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్య ఫామ్ లేమి కాస్త ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు టీమిండియాను (INDvsNZ) ప్రధానంగా వేధిస్తున్న సమస్య బౌలింగ్. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో 253 పరుగుల కొండంత స్కోరు చేసినప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించలేకపోయారు. ఆఖర్లో బుమ్రా, పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయబట్టి సరిపోయింది కానీ, లేదంటే ఫలితం మరోలా ఉండేది. అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి (సెమీస్‌లో 60 కి పైగా పరుగులు ఇచ్చాడు) ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ (INDvsNZ) కోసం వరుణ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను, అర్ష్‌దీప్ స్థానంలో సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
అభిషేక్‌పై వేటు తప్పదా?
ఓపెనర్ అభిషేక్ శర్మ టోర్నీ పొడవునా తీవ్ర నిరాశపరిచాడు. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ మినహా మిగతా మ్యాచుల్లో విఫలమయ్యాడు. అనవసర షాట్లకు పోయి వికెట్ పారేసుకుంటున్న అభిషేక్‌ను ఫైనల్ (INDvsNZ) కోసం తుది జట్టు నుంచి తప్పించే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో డాషింగ్ ఫినిషర్ రింకూ సింగ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
కివీస్ ప్రమాదకారులే..
దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ సృష్టించిన సుడిగాలి విధ్వంసం (33 బంతుల్లోనే సెంచరీ) భారత్‌కు గట్టి హెచ్చరిక. సీఫెర్ట్, ఫిలిప్స్‌తో పాటు బంతితో అదరగొడుతున్న రచిన్ రవీంద్ర (11 వికెట్లతో టాప్), శాంట్నర్‌లను నిలువరించడం భారత బౌలర్లకు సవాలే.
హై-స్కోరింగ్ పిచ్.. రికార్డులు మనవైపే!
నరేంద్ర మోదీ స్టేడియంలోని ‘మిక్స్డ్ పిచ్’పై (ఎర్ర, నల్ల మట్టితో తయారైన) ఫైనల్ (INDvsNZ) జరగనుంది. ఇది బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుందని, ఫైనల్ హై-స్కోరింగ్ మ్యాచ్ కానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీ20 ముఖాముఖి పోరులో న్యూజిలాండ్‌పై భారత్‌దే పైచేయి. ఇప్పటివరకు ఆడిన 30 మ్యాచుల్లో భారత్ 18 సార్లు గెలవగా, కివీస్ 11 (INDvsNZ) సార్లు నెగ్గింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. టోర్నీకి ముందు జరిగిన సిరీస్‌ను సైతం భారత్ 4-1 తో కైవసం చేసుకోవడం మన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది.
ఇవి కూడా చదవండి
