తెలంగాణ ఎన్నికలు.. గెలుపెవరిది?

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది అన్నదానిపై ఎవరి అంచనాలు వారివే అన్నట్లుగా కనిపిస్తోంది. మీడియా సంస్థలు, ఇతర సామాజిక సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు కూడా ఫలితాలను ఒక్కో విధంగా చెబుతున్నాయి. దీంతో దేనిని విశ్వసించాలో తెలియని పరిస్థితి ఉంది. ముందస్తు ఎన్నికలను ప్రకటించినప్పుడు అధికార టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అందరూ భావించారు. కాంగ్రెస్‌వైపు ఆదరణ ఉన్నప్పటికీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు, దానికితోడు కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కోవడానికి సరైన నాయకుడు లేదని భావించారు. పల్లెల్లో పట్టు ఉన్నప్పటికీ కోదండరామ్‌కు పూర్తిస్థాయిలో పోటీ చేసే సత్తా లేకపోవడంతో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని భావించారు.
అదే సమయంలో తెలంగాణలో ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే ఎపిలో ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌తో డైరెక్టుగా కలవకుండా, కాంగ్రెస్, సిపిఐ, టీజెఎస్, తెలుగు దేశం పార్టీ కలిసి ఉమ్మడి కూటమిగా ఎన్నికల్లో దిగేలా కృషి చేశారు. ఆయన కృషి ఫలించింది. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఈ నాలుగు పార్టీలు కలిసి ఉమ్మడిగా మహాకూటమిని ఏర్పాటు చేసుకుని రంగంలోకి దిగింది. దాంతో ఓటర్లలో కూడా మార్పు కనిపించింది. అంతవరకు టీఆర్‌ఎస్‌వైపే ఉన్న అంచనాలు క్రమక్రమంగా తొలగిపోవడం కనిపించింది. మరోవైపు కూటమి బలపడటం బయటపడింది.
తొలుత ధీమా…తరువాత పోరాటం
ముందస్తు ఎన్నికలు ప్రకటించినప్పుడు అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న కేసీఆర్ తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల్లో తమ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తున్నారు. తమ విజయంనల్లేరు మీద నడకే అని అనుకున్న కేసీఆర్ కూటమి ఏర్పాటు, చంద్రబాబు జోక్యం చూసి ప్రత్యర్థులను ఎదుర్కోవడం సులువుకాదని అర్థం చేసుకున్నారు. ప్రజలను ఆకట్టుకునేలా ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశారు. కూటమి బలంగా ఉన్న చోట మంత్రులను, సీనియర్లను ఇన్‌ఛార్జీలుగా నియమించాడు. ముందస్తు ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి అధికారంలోకి రావాలన్న లక్ష్య సాధనకు క్షేత్రస్థాయిలో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని, కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ప్రచార తీరును పట్టించుకోకుండా వారిపై నిరసనలు వ్యక్తం చేయడాన్ని గమనించారు. దానికితోడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా పరిస్థితిలో మార్పులు రాకపోవడంతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించి, ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతున్న నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్‌లోని ముఖ్యనేతలను ఎన్నికల ఇన్‌చార్జిలుగా నియమించారు. కీలక నేతలు కె.తారకరామారావు, తన్నీరు హరీశ్‌రావు తదితరులకు ఈ సెగ్మెంట్ల ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ ఇద్దరు మంత్రులు తప్ప మిగిలిన ఇన్‌చార్జిలు అందరూ ఎన్నికలు ముగిసే వరకు ఆయా నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి ఎన్నికల బాధ్యతలు నిర్వహించేలా కేసీఆర్ మార్పులను చేశారు.
టీఆర్‌ఎస్ సంస్థాగతంగా మొదటి నుంచి బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలోని నియోజకవర్గాలపై కేసీఆర్ దృష్టి సారించారు. ఎంఐఎం పోటీ చేసే ఏడు స్థానాలను మినహాయించి గ్రేటర్ హైదరాబాద్‌లోని 15 సీట్లతోపాటు ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ ఎన్నికల బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 స్థానాలతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు స్థానాల బాధ్యతను హరీశ్‌కు ఇచ్చారు. సిద్ధిపేట పొరుగున ఉండే జనగామ, హుస్నాబాద్ సెగ్మెంట్ల బాధ్యతలు కూడా హరీశే పర్యవేక్షించనున్నారు. జగిత్యాల, కోరుట్ల స్థానాల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్‌ఎస్ అధిష్టానం ఈ రెండు సెగ్మెంట్ల బాధ్యతలను నిజామాబాద్ ఎంపీ కవితకు అప్పగించింది. అభ్యర్థుల ప్రచారం విషయంలో అసంతృప్తితో ఉన్న ములుగు, మహబూబాబాద్, నర్సంపేట స్థానాల బాధ్యతను టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇచ్చారు. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు సీట్లకు కూడా ఈసారి ప్రత్యేక ఇన్‌చార్జిలను నియమించారు. వంద సీట్ల లక్ష్య సాధనలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 24 నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్‌చార్జిలను నియమించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కూటమి వ్యూహం
అధికారంలో ఉంటూ బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్ళడమే మంచిదని కూటమి నాయకులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమణ, టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వ్యూహాలను తీర్చిదిద్దుతున్నారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన కూటమి అభ్యర్థులు ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు తమ గత చరిత్రను పక్కనపెట్టి ఉమ్మడిగా పోరాటానికి దిగారు. ఉమ్మడి మేనిఫెస్టోనే ప్రవేశపెట్టాలని అనుకున్నారు.
తెలంగాణపై రాహుల్ ప్రత్యేక దృష్టి
తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా రాష్ట్రంపై దృష్టి సారించారు. ఇప్పటికే ఓ విడత తెలంగాణలో పర్యటించి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచిన రాహుల్ అభ్యర్థుల ఎంపికలో కూడా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ గత ఎన్నికల్లో ప్రజలకు చేరువకాలేకపోయిన కాంగ్రెస్‌ను ఈసారి ప్రజలే ఆదరించేలా అన్నీ చర్యలను చేపట్టారు. రాహుల్ ప్రత్యేక దృష్టితో పార్టీ నాయకుల్లో కూడా ఉత్సాహం వచ్చింది. దానికితోడు ఇతర పార్టీలు కూడా కలవడంతో ఇక విజయం తథ్యమేనన్న భావనలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి. దీనికి తోడు ప్రచారంలో పాల్గొనేందుకు సోనియాగాంధీ కూడా సరేననడం వారికి మరింత బలాన్ని ఇచ్చింది.
బిజెపిలో ఉత్సాహం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్సాహంతో ఉంది. ఏ పార్టీతోనూ ప్రత్యక్షంగా పొత్తు లేకపోవడంతో తమకు బలం ఉన్న చోట్ల అంతా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ముషీరాబాద్ నియోజకవర్గం?నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో 66 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన భాజపా మిగిలిన స్థానాల్లో ఎంపికకు కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపేందుకు మహాకూటమిలో, తెరాసలో సీట్లు దక్కనివారిని తమ పార్టీలోకి రావాల్సిందిగా కోరుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన 53 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో భాజపా అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నారు. వీటికి కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యనేతలు, ఇటీవల పార్టీలో చేరిన శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద హాజరవుతున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇప్పటికే మహబూబ్‌నగర్, కరీంనగర్, హైదరాబాద్ సభల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీతో మూడు, నాలుగుచోట్ల బహిరంగ సభలకు పార్టీ ఏర్పాట్లుచేస్తోంది.
పాతబస్తీపైనే ఎంఐఎం దృష్టి
ఈఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని మారిన పరిస్థితుల్లో సాధ్యమైనంతవరకు అన్నీచోట్లా గెలవాలని ఎంఐఎం భావిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లపై విశ్వాసంతో బరిలో దిగింది. గత ఎన్నికల్లో నెగ్గిన చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట, బహదూర్‌పురలో తాజా మాజీ ఎమ్మెల్యేలనే ఎంఐఎం బరిలో దింపింది. యాకుత్‌పురాకు ప్రాతినిథ్యం వహించిన ముంతాజ్‌ఖాన్‌ను ఈసారి చార్మినార్ నుంచి బరిలో దింపగా.. చార్మినార్ తాజా మాజీ ఎమ్మెల్యే అహ్మద్‌పాషా ఖాద్రీ యాకుత్‌పురా నుంచి పోటీచేస్తున్నారు. ఎంఐఎం పక్ష మాజీనేత అక్బరుద్దీన్ ఒవైసీ మరోమారు చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేస్తున్నారు.
ఏదీ ఏమైనా ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిస్తే తనకు తిరుగులేదని, కేంద్రంలో కూడా చక్రం తిప్పవచ్చని అనుకుంటోంది. ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ గెలుపు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉపకరిస్తుందని చెబుతోంది. భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో చక్రం తిప్పాలని అనుకుంటోంది. ఇదే విధంగా ఎఐఎం కూడా రాష్ట్ర పాలనలో తన భాగస్వామ్యం ఉండేలా చూడాలంటే గెలుపు ప్రధానమని భావిస్తోంది. ఇలా అన్నీ పార్టీలు తమదే గెలుపు అన్నట్లుగా బరిలోకి దిగాయి. చివరకు ఓటరు అంతిమంగా ఎవరిది గెలుపు అని నిర్ణయిస్తారో చూడాలంటే వేచి ఉండాల్సిందే.