KCR: కవితకు కేసీఆర్ ఆహ్వానం..?

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత(Kavitha) వ్యవహారం హాట్ టాపిక్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత, చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీ అధినేత కేసిఆర్ ను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో.. విపక్షాలను నానా ఇబ్బందులు పెట్టిన బిఆర్ఎస్, ఇప్పుడు కుటుంబ సమస్యలతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కవితను శాంతింప చేయాలని కేసిఆర్ ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా సరే లాభం లేకుండా పోయింది.
నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ను లక్ష్యంగా చేసుకుని కవిత విమర్శలు చేశారు. దీనితో కవితను కేసీఆర్ సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు కవిత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అప్రమత్తమైంది. కవిత పోటీ చేస్తే ఖచ్చితంగా తమ పార్టీ ఓట్లు చీలుతాయి అనే భావనలో ఆ పార్టీ అధిష్టానం ఉంది. తెలంగాణ జాగృతి నుంచి కవిత మాజీ ఎమ్మెల్సీ అలీ ఖాన్ ను పోటీలో నిలబెట్టే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
దీనితో మాజీ సీఎం కేసీఆర్ కవితను ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పిలిచినట్లు సమాచారం. ఆమెతో చర్చలు జరపాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కవితను పోటీ నుంచి తప్పిస్తే తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే భావనలో కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. ఒకవేళ కవిత పోటీ చేస్తే పార్టీ ఓట్లు చీలడమే కాకుండా అది అధికార పార్టీకి లాభం చేసే అవకాశం ఉండవచ్చు అంటూ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కవితకు పడటం సంగతి పక్కనపెడితే, బీఆర్ఎస్ ఓట్లు మాత్రం కవితకు కొంత పడే అవకాశాలు జూబ్లీహిల్స్ లో ఉన్నాయి.
రెండు మూడు రోజుల్లో కవితతో కేసీఆర్ చర్చలు జరిపి, ఆమెను శాంతింప చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. కవితతో కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయిందని, అందుకే కేసిఆర్ నేరుగా రంగంలోకి దిగారు అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల తో పాటుగా ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనబడుతోంది. నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.