Basket Ball: అండర్-16 ఆసియా కప్‌లో మెరిసిన తెలంగాణ అమ్మాయి

– 21 పాయింట్లతో చెలరేగిన టీమిండియా వైస్ కెప్టెన్ విహా రెడ్డి
– మలేసియాలో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్‌పై 67-66 పాయింట్లతో గెలుపు
– డివిజన్-బిలో నెగ్గి డివిజన్-ఏకు ప్రమోట్ అయిన భారత జట్టు
ఎనిమిదేళ్ల తర్వాత ఫిబా అండర్-16 మహిళల ఏసియా కప్‌లో (FIBA U16 Women’s Asia Cup) భారత అమ్మాయిలు విజేతలుగా నిలిచారు. మలేసియా వేదికగా జరిగిన డివిజన్-బి పోటీల్లో భారత అమ్మాయిలు చెలరేగారు. తెలంగాణ బిడ్డ విహా రెడ్డి (Viha Reddy) 21 పాయింట్ల, 10 రీబౌండ్స్ డబుల్-డబుల్స్‌తో అదరగొట్టింది. మరో అమ్మాయి అదితి సుబ్రమణియన్ 19 పాయింట్లతో సత్తాచాటింది. మహెక్ శర్మ 10 పాయింట్లు, 18 రీబౌండ్ డబుల్-డబుల్స్‌తో ఆకట్టుకుంది. ఈ మ్యాచులో భారత జట్టు 67-66 తేడాతో ఇరాన్ జట్టును ఓడించింది. విహా ఈ జట్టుకు వైస్ కెప్టెన్ కూడా కావడం గమనార్హం. ఈ విజయంతో భారత అమ్మాయిల జట్టు డివిజన్-ఏకు అర్హత సాధించింది.
బాస్కెట్‌బాల్‌లో ఎంతో అనుభవం ఉన్న విహా (Viha Reddy).. ఇంటర్నేషనల్ స్కూల్స్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఎస్ఓ) అండర్-17 నేషనల్స్‌లో ఆడింది. ఐఎస్ఎస్ఓ అండర్-19 టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించిన జట్టులో సభ్యురాలిగా ఉంది. నల్గొండ జిల్లా మడుగులపల్లి మండలం గారకుంటపాలెంకు చెందిన విహా (Viha Reddy) .. తెలంగాణ నుంచి భారత జట్టుకు ఎంపికైన అమ్మాయి. అంతేకాదు తెలంగాణ నుంచి భారత్‌కు వైస్ కెప్టెన్‌గా నియమితురాలైన తొలి ప్లేయర్ కూడా కావడం విశేషం.