US: ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు అమెరికా ప్రగతికే అడ్డుగోడలు.. వీసా ఫీజు పెంపుపై నిపుణులు..!

హెచ్-1బీ వీసాల (H-1B visa applications) దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నిర్ణయం… ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా టెక్ కంపెనీలు అయితే తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. తమ ఉద్యోగులు ఎక్కడున్నా ఆదివారం ఉదయానికల్లా వచ్చేయాలని మెయిల్స్ కూడా పంపిస్తున్నాయి. దీనిపై ఇండియాలోని సాఫ్ట్ వేర్ రంగం ఆందోళనలో మునిగిపోయింది. అయితే ఇది తాత్కాలికంగా అమెరికాకు లాభించినా.. దీర్ఘకాలంలో మాత్రం తీవ్ర నష్టం తప్పదంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇదే ఆందోళన అమెరికా కాంగ్రెస్ సెనెటర్లు, మాజీలు వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ విధించిన లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు యూఎస్ ఆవిష్కరణలకు ఊపిరాడకుండా చేస్తుంది. భారతదేశాన్ని టర్బోఛార్జ్ చేస్తుంది. ప్రపంచస్థాయి ప్రతిభకు తలుపులు మూసేయడం వల్ల అమెరికాలో ఏర్పడాల్సిన ల్యాబ్స్, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు బెంగళూరు, హైదరాబాద్, పుణె, గురుగ్రామ్‌కు వచ్చేస్తాయి. దాంతో భారతదేశంలో అత్యుత్తమ వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు వికసిత్ భారత్ దిశగా దేశ పురోగతికి దోహదం చేసే అవకాశం ఉంది. అమెరికాకు నష్టం కలిగించే ఈ నిర్ణయం భారత్‌కు లాభం చేకూర్చనుంది’’ అని అమితాబ్‌కాంత్ (Former NITI Aayog CEO Amitabh Kant) ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మన దేశానికి మేలు చేకూర్చుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ట్రంప్ చర్యను ఖండిస్తోన్న యూఎస్ ప్రముఖులు..
ఇదొక నిర్లక్ష్యపూరిత ప్రయత్నం. మన శ్రామికశక్తిని ఎంతోకాలంగా బలోపేతం చేసిన, ఆవిష్కరణలకు దోహదం చేసిన, లక్షలాది మంది అమెరికన్లకు ఉపాధి కల్పించే పరిశ్రమలను ఏర్పాటుచేయడంలో సహాయపడిన అధిక నైపుణ్యం కలిగిన కార్మికులను అమెరికా నుంచి దూరం చేయడమే అవుతోందన్నారు – యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి
హెచ్-1బీ ప్రోగ్రామ్ అనేది ఆవిష్కరణలకు ప్రాణాధారం. దానిద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్‌ను అమెరికా ఆకర్షిస్తోంది. ఈ ఫీజు వల్ల ఇకపై అడ్డంకులు ఎదురుకానున్నాయి. భిన్నమైన టాలెంట్ ఆధారంగా నడిచే చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లను అణచివేస్తుంది. ఆర్థికవ్యవస్థ దూసుకెళ్లేందుకు ఉపకరించే నిపుణులను దూరం చేస్తుందన్నారు – జో బైడెన్ మాజీ సలహాదారు..అజయ్ భుటోరియా
ఈ నిర్ణయం దురదృష్టకరమని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాఫ్ట్‌వేర్, టెక్ పరిశ్రమకు నష్టం చేకూర్చనుందని అంచనా వేస్తున్నారు. స్టెమ్ కోర్సు ద్వారా యూఎస్ (USA) విద్యాభ్యాసం చేసినవారిపై ఇప్పటికే ఏఐ, టారిఫ్‌లు ప్రభావం చూపుతుండగా, ఈ ఫీజు పెనుభారం కానుందని చెప్తున్నారు. ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దాంతో ఆ సంస్థలు వారిని నియమించుకునేందుకు మొగ్గు చూపకపోవచ్చని తెలుస్తోంది.