H1B Visa పై ట్రంప్ పిడుగు.. హెచ్ 1బి వీసా రుసుం లక్ష డాలర్లకు పెంచేసిన అమెరికా..

భారత్ పై ఇప్పటికే 50 శాతం టారిఫ్ తో ట్రేడ్ వార్ షురూ చేసిన అమెరికా అధ్యక్షుడు.. ఇప్పుడు ఏకంగా బ్రహ్మాస్త్రాన్నే వాడారు. అమెరికాలో వీసాల నుంచి అన్నింటి రూల్స్ టైట్ చేసిన ట్రంప్.. ఇప్పుడు పిడుగు లాంటి వార్త వినిపించారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం భారత్‌తో పాటు, చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ప్రతి హెచ్-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. ‘‘మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి’’ అని లుట్నిక్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మరోవైపు.. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు.
1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్-1బీ వీసా తీసుకొచ్చారు. యూఎస్‌లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు.
దీంతో ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. అమెరికా ఏటా 85వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది.