Modi: ఆత్మనిర్భర్ భారత్ గా మారాల్సిన సమయం ఆసన్నమైంది.. హెచ్ 1 బి వీసా పెంపు వేళ మోడీ పిలుపు..

భారత్ ఇప్పుడు అత్యంత తీవ్ర, జఠిల సమస్యను ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్…భారత్ ను లొంగదీసుకునేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఓవైపు మోడీ తనకు మంచి మిత్రుడని..భారత్ మిత్రదేశం అంటూనే.. మరోవైపు మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా హెచ్ 1 బీ వీసా (H1B Visa) వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచేశారు. దీంతో ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేయనుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ప్రధాని మోడీ ఆసక్తికరమైన కామెంట్ చేశారు.
‘నేడు భారత్ ‘‘విశ్వబంధు’’ స్ఫూర్తితో ముందుకుసాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతరదేశాలపై ఆధారపడటమే. దీన్ని మనం ఓడించాలి. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే.. దేశ అభివృద్ధి విఫలమవుతుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్‌గా మారాలి. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. భారతదేశ అభివృద్ధిని, భావితరాలను పణంగా పెట్టలేం’ అని మోదీ పేర్కొన్నారు.
ఈసందర్భంగా దేశం భరించాల్సిన నష్టాల్లో షిప్పింగ్ రంగం ఒకటని మోదీ స్పష్టం చేశారు.50 ఏళ్ల క్రితం మన దేశంలో తయారుచేసిన నౌకలనే మనం ఉపయోగించుకొనేవాళ్లమన్నారు. కానీ, కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రంగం పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. వారి ప్రభుత్వ హయాంలో స్వదేశంలో నౌకల తయారీపై దృష్టిపెట్టకుండా విదేశీ నౌకలకు అద్దెలు చెల్లించేందుకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. అందువల్లే ఇప్పటికీ మన వాణిజ్యంలో 90 శాతం విదేశీ నౌకల పైనే ఆధారపడుతున్నామన్నారు. ఇందుకుగాను మనం ఏటా రూ.6 లక్షల కోట్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఇది దేశ రక్షణ బడ్జెట్ కంటే ఎక్కువన్నారు.