TTD: తిరుమల పరకామణిలో దొంగతనం… భాను ప్రకాష్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్..!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి (Bhanuprakash Reddy) ఇవాళ కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. తిరుమలలో హుండీ కానుకలు లెక్కించే విభాగం- పరకామణీలో (parakamani) 100 కోట్లకు పైగా దొంగతనం జరిగినట్లు ఆరోపించారు. వైసిపి (YSRCP) ప్రభుత్వ హయాంలో ఈ భారీ కుంభకోణం జరిగిందని, దేవస్థానం అధికారులు, పోలీసులు, వైసిపి నేతలు కలిసి స్వామి వారి సొమ్మును దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో కీలక పాత్ర పోషించిన సి.వి.రవికుమార్‌కు సంబంధించిన వీడియోలు, డాక్యుమెంట్లు విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాలు, లోక్ అదాలత్ రాజీల వివరాలను బయటపెట్టారు.
పెద్ద జీయర్ మఠం క్లర్క్ గా ఉన్న సి.వి.రవికుమార్ (CV Ravikumar) 2023 ఏప్రిల్ 29న తిరుమల పరకామణిలో దొంగతనం చేస్తుండగా టిటిడి విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాలు పట్టుకున్నాయి. ఆయన తన లోదుస్తుల్లో 900 అమెరికన్ డాలర్లు అంటే సుమారు రూ. 75,000లు దొంగలించారు. ఆయన ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అనేకసార్లు ఆయన దొంగతనాలకు పాల్పడ్డారు. విదేశీ కరెన్సీను పెద్దఎత్తున ఇలా దొంగలించినట్లు గుర్తించారు. దాదాపు ఆయన రూ. 200 కోట్లకు పైగా దొంగతనం చేసి, ఆ మొత్తంతో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టుకున్నాడనే ఆరోపణలున్నాయి. అయితే రవికుమార్ దొంగతనాల వెనుక టిటిడి అధికారులు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్, పోలీసు అధికారులు కూడా ఉన్నట్టు భాను ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. టిటిడి చరిత్రలో ఇది అత్యంత భారీ దొంగతనం అని ఆయన అన్నారు. ఈ ఆరోపణలకు సాక్ష్యంగా రవికుమార్ దొంగతనానికి సంబంధించిన వీడియోలు, ఎఫ్‌ఐఆర్ కాపీలు, పరిశోధన నివేదికలను బయట పెట్టారు.
వైసిపి ప్రభుత్వ కాలంలో ఈ కుంభకోణం జరిగిందని, పార్టీ ప్రముఖుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ ఇందులో భాగస్వాములని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దోచుకున్న సొమ్ములో కొంత భాగం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిందన్నారు. వైసిపి నేతలకు వాటాలు పంచారని వెల్లడించారు. అప్పడు టిటిడి చైర్మన్ గా భూమన్ కరుణాకర్ రెడ్డి హయాంలోనే ఈ దొంగతనాలు జరిగాయని, దీనిపై ఆయన సమాధానం చెప్పాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో భాగస్వాములైన వైసీపీ నేతలు, అధికారుల పేర్లను కూడా త్వరలోనే బయటపెడతానని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో ఓ అధికారి పశ్చాత్తాపంతో అప్రూవర్ గా మారేందుకు సిద్ధమయ్యారని కూడా చెప్పారు.
రవికుమార్ మీద 2023 మే 30న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. జూన్‌లో చార్జ్ షీట్ దాఖలైంది. కానీ, సెప్టెంబర్ 9న లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుని కేసు క్లోజ్ అయింది. ఇది పోలీసు, అధికారుల అధికార దుర్వినియోగంతో జరిగిందని, రవికుమార్‌ను బెదిరించి దోచుకున్న మొత్తాన్ని వైసిపి నేతలు, అధికారులు పంచుకున్నారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాజీ తర్వాత అన్ని సాక్ష్యాలు, వీడియో ఫుటేజీలను ధ్వంసం చేశారని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
అయితే ఈ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సీఐడిని ఆదేశించింది. వచ్చే నెల రోజుల్లోపు విచారణ జరిపి నివేదికను సీల్డ్ కవర్‌లో అందివ్వాలని ఆదేశించింది. దానికి సంబంధించిన టిటిడి బోర్డు నిర్ణయాలు, ఇతర డాక్యుమెంట్లను అన్నిటినీ సీజ్ చేయాలని కోరింది.
భాను ప్రకాష్ రెడ్డి మరో సంచలన ఆరోపణ చేశారు. తిరుమల లాస్ట్ అండ్ ఫౌండ్ విభాగంలో భక్తులు పోగొట్టుకున్న కోట్ల రూపాయల విలువైన వస్తువులు కూడా మాయమయ్యాయన్నారు. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ ఈ మోసానికి కారణమని, అంతర్గత పరిశోధనలో ఆరోపణలు నిజమని నిర్ధారణ అయిందన్నారు. అయినా, ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా శివశంకర్‌ను తిరిగి తన డిపార్ట్‌మెంట్‌కు పంపేశారని ఆరోపించారు. ఈ రెండు స్కామ్‌లకు సంబంధించి దర్యాప్తుకోసం సిట్టింగ్ జడ్జితో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన టిటిడి చైర్మన్ బి.ఆర్.నాయుడుకు వినతిపత్రం సమర్పించారు.