Zohran Mamdani: మమ్దానీ విజయంపై డెమొక్రాట్లలో వైరుధ్యాలు…?
న్యూయార్క్ మేయర్ గా జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) ఎన్నికవ్వడం దేనికి సంకేతం.. ఇప్పుడిదే అంశం అమెరికాలోనూ, డెమొక్రాట్లలోనూ పెద్దచర్చనీయాంశమైంది. ముఖ్యంగా తనకు ఎదురులేదంటూ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న అధ్యక్షుడు ట్రంప్ కు మమ్దానీ విజయం చెంపపెట్టుగా పలువురు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ట్రంప్ చెప్పినట్లలా ఆడుతున్న రిపబ్లికన్లకు .. ఇది ఓ పరోక్ష హెచ్చరికగా సూచిస్తున్నారు. ఇప్పుడు రిపబ్లికన్లు మేల్కొనకపోతే… వచ్చే ఎన్నికల్లో పతనం తప్పదన్న భావన కనిపిస్తోంది.
Democratic party: మమ్దానీ గెలుపు డెమోక్రటిక్ పార్టీలోని వైరుధ్యాలనూ బహిర్గతం చేసింది. మమ్దాని ఎన్నిక అమెరికాలో మార్క్సిజం బలోపేతమైందనడానికి సంకేతమని డెమొక్రాట్లలో ఓ వర్గం వర్గం భావిస్తోంది. . ఆయన డెమోక్రటిక్ పార్టీకి మంచి భవితవ్యాన్ని అందించగలరని ఒక వర్గం భావిస్తుండగా, మరో వర్గం ఇది పార్టీలో పెరుగుతున్న డెమోక్రటిక్ సోషలిస్టుల ప్రాబల్యానికి నిదర్శనమని భావిస్తోంది.
మమ్దానీ స్ఫూర్తిమంతమైన కొత్త భావాలకు ప్రతిరూపం. ఈ ఎన్నిక ద్వారా న్యూయార్క్ ఓటర్లు తమ మొగ్గు ఎటువైపో తేల్చి చెప్పారు’ అని ద గార్డియన్ పత్రిక తన వ్యాసంలో పేర్కొంది. వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రికలు మమ్దానీ విజయాన్ని ఒక డెమోక్రటిక్ సోషలిస్టు గెలుపుగా అభివర్ణించాయి. ఫాక్స్ న్యూస్, న్యూయార్క్ పోస్ట్ వంటి పత్రికలు మమ్దానీ విజయాన్ని ఒక సోషలిస్టు ప్రయోగంగా, ప్రబలమవుతున్న మార్క్సిజం ప్రాభవంగా పేర్కొన్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్‌నకు ఏడాది కాకముందే చుక్కెదురైంది. తాజాగా జరిగిన పలు రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. మేయర్ల ఎన్నికల్లోనూ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఎన్నికలపై ‘బిగ్ బ్యూటిఫుల్’ బడ్జెట్ బిల్లు సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు వంటి ట్రంప్ ప్రభుత్వ విధానాలు ప్రభావం చూపాయనే వాదన వినిపిస్తోంది. అయితే ఎన్నికలకు ట్రంప్ దూరంగా ఉండటం, షట్డౌన్వల్లే రిపబ్లికన్లు ఓడిపోయారని రాజకీయ విశ్లేషకులు చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు తన సొంత సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.







