Amaravathi: భారత క్వాంటమ్ విప్లవానికి కేంద్రంగా అవతరించనున్న అమరావతి..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Amaravati) సాంకేతిక ప్రపంచంలో కొత్త చరిత్ర సృష్టించబోతోంది. దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ కంప్యూటర్ (Quantum Computer) ఏర్పాటు అయ్యే నగరంగా అమరావతి పేరు నిలుస్తోంది. ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley) ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వేగంగా ముందుకు తీసుకువెళ్తోంది. వచ్చే సంవత్సరం జనవరి 1న ఈ ప్రాజెక్టు ప్రారంభం కానున్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు ప్రధాన క్వాంటమ్ హబ్‌లలో అమరావతి ఒకటిగా గుర్తింపుపొందబోతోంది.
ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం కేవలం దేశీయంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో క్వాంటమ్ సాంకేతికతా కేంద్రంగా అవతరించనుంది. విద్య, పరిశోధన, పరిశ్రమల రంగాలలో విప్లవాత్మక మార్పులకు ఇది దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కృత్రిమ మేధస్సు (Artificial Intelligence), మిషన్ లెర్నింగ్ (Machine Learning), సైబర్ సెక్యూరిటీ (Cyber Security), సెమీ కండక్టర్ల తయారీ, ఆర్ఎఫ్ ఇంజనీరింగ్ (RF Engineering), క్వాంటమ్ మెటీరియల్స్ (Quantum Materials) వంటి రంగాల్లో యువతకు శిక్షణ ఇవ్వడం ఈ వ్యాలీ ప్రధాన లక్ష్యం.
అమరావతిలో అమెరికాకు చెందిన విసెర్ (Viser) సంస్థ ఆధ్వర్యంలో క్వాంటమ్ ట్యాలెంట్ హబ్ (Quantum Talent Hub) ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా 50 వేల మంది విద్యార్థులకు ప్రాథమిక శిక్షణ ఇవ్వడమే కాకుండా, 100 మంది ఉన్నత స్థాయి పరిశోధకులను తయారుచేయనున్నారు. ఎన్వీడియా (NVIDIA) సంస్థ ఆధునిక ఏఐ సిమ్యులేషన్ ప్లాట్‌ఫారమ్ మరియు హైబ్రిడ్ సూపర్ కంప్యూటింగ్ స్టోరేజ్ సదుపాయాలను అందించనుంది. అదేవిధంగా ఏడబ్ల్యూఎస్ (AWS) సంస్థ అమరావతిలో ఏడబ్ల్యూఎస్ యాక్సిలరేటర్ (AWS Accelerator) ప్రారంభించి, 50 వేల మంది యువతకు సర్టిఫికేషన్ కార్యక్రమం చేపడుతోంది.
క్వాంట్రోలాక్స్ (Quantro Lax) సంస్థ రూ.25 కోట్లతో ఓపెన్ ఆర్కిటెక్చర్ విద్యా ప్లాట్‌ఫారమ్ నిర్మిస్తోంది. పీక్యూ స్టేషన్ (PQ Station) సంస్థ ఆధ్వర్యంలో క్రిప్టోగ్రఫీ టెస్టింగ్ హబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ భాగస్వామ్యాలతో రాష్ట్రంలో 3 వేల మంది విద్యార్థులకు ప్రగతిశీల క్వాంటమ్ శిక్షణ ఇవ్వడమే కాకుండా, 100 మంది పరిశోధకులను అంతర్జాతీయ స్థాయిలో సిద్ధం చేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం దీన్ని శాశ్వత విద్యా, పరిశోధనా వేదికగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఇప్పటివరకు 108 ల్యాబ్‌ల కోసం 134 ప్రతిపాదనలు వచ్చాయి. అల్గోరిథమ్ పరిశోధనకు 55 సంస్థలు ఆసక్తి చూపాయి. అలాగే 197 విశ్వవిద్యాలయాల్లో 1056 మంది అధ్యాపకులు ఇప్పటికే శిక్షణ పొందారు. 137 కళాశాలల నుంచి వచ్చిన 1127 హ్యాకథాన్ ఆలోచనలు ఈ ప్రాజెక్టుకు ప్రేరణగా మారాయి.
దిమిరా (IIT-Bombay), ఇండ్ రోబో (Ind Robo), రియలిస్టిక్ (Realistic), క్యూరియం (Curium) వంటి స్టార్టప్స్ క్వాంటమ్ సప్లయ్ చైన్ (Quantum Supply Chain) కోసం పరికరాల అభివృద్ధిపై పనిచేస్తున్నాయి. డీఆర్డీవో (DRDO), ఫిజిత్సు (Fujitsu), పాస్కల్ (Pasqal) వంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలతో కలిసి ఈ ప్రాజెక్టు మరింత విస్తరించనుంది. 2030 నాటికి అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే కేంద్రంగా నిలుస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. భారత్ భవిష్యత్తు సాంకేతికతకు అడుగులు వేస్తున్న ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య భాగస్వామిగా ఎదుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.







