YCP: వైసీపీని వీడే ప్రచారంపై ఎమ్మెల్యే మత్స్యలింగం క్లారిటీ..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీ ఆసక్తిగా మారుతున్నాయి . ఇటీవల నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని (YCP ) వీడి టీడీపీ (TDP) , బీజేపీ (BJP) పార్టీలకు చేరడం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల తర్వాత ఇంకా పలువురు నేతలు పార్టీ మార్పుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం మరింత వేడెక్కింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన వైసీపీ బలహీనతలను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. అధికారంలో లేని వైసీపీని మరింత ఇబ్బందులకు గురి చేయడానికి ఈ వలసలు కీలకంగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ తరహా పరిణామాలు వేగంగా జరిగాయి. ముఖ్యంగా గతంలో వైసీపీకి చెందిన పలువురు రాజ్యసభ సభ్యులు పార్టీకి దూరమయ్యారు. వీరిలో విజయ సాయిరెడ్డి (Vijay Sai Reddy), మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkataramana), బీద మస్తాన్ రావు (Beeda Mastan Rao), క్రిష్ణయ్య (Krishnayya) లాంటి నాయకులు ఉన్నారు. విజయసాయిరెడ్డి అయితే రాజకీయాలకే గుడ్‌బై చెప్పారు. మస్తాన్ రావు, మోపిదేవి టీడీపీ తీర్థం పుచ్చుకోగా, క్రిష్ణయ్య మాత్రం బీజేపీలో చేరారు.
ఇక వైసీపీకి చెందిన ఎమ్మెల్సీల విషయానికొస్తే, ఒకప్పుడు 35 మంది సభ్యులు ఉన్నప్పటికీ ఆరుగురు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో ముగ్గురు నేరుగా టీడీపీలో చేరగా, పోతుల సునీత (Pothula Sunitha) బీజేపీ వైపు వెళ్లారు. అలాగే జయమంగళం వెంకటరమణ (Jayamangalam Venkataramana), మండలి డిప్యూటీ చైర్మన్ ఖానం (Khanam) జనసేన లేదా బీజేపీతో చర్చలు జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారన్న ప్రచారం నెలకొంది. ముఖ్యంగా అల్లూరి జిల్లాకు చెందిన అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం (Rega Matsyalinagam) పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయనను గతంలో సభకు వెళ్లే అవకాశాన్ని ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తమైందని చెప్పుకుంటున్నారు. దీంతో వైసీపీ లోపల పెద్ద చర్చ చెలరేగింది.
కానీ ఈ ప్రచారం మొత్తాన్ని ఖండిస్తూ మత్స్యలింగం స్పష్టంగా స్పందించారు. తన రాజకీయ ప్రస్థానం మొత్తంలో వైసీపీ అధినేత జగన్ (Jagan Mohan Reddy) తోనే ఉంటానని తేల్చి చెప్పారు. పార్టీ మారుతానన్న కథనాలు పూర్తిగా అబద్ధమని పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానేమో కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని మారే ఉద్దేశం లేదని తెలిపారు. తన రాజకీయ ఎదుగుదలకి కారణం జగన్ అని గుర్తుచేసుకుంటూ, ఆయనకు ద్రోహం చేయడం తన వల్ల కాదని అన్నారు. కుటుంబ సభ్యులంతా వైసీపీకి కట్టుబడి ఉన్నారని కూడా క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా ఆయన స్పష్టత ఇచ్చినా, ఇటీవల ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల వలసలతో వైసీపీ లోపల అస్థిరత చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది.