CBI – KCR: మరిన్ని చిక్కుల్లో కేసీఆర్..! రేవంత్ నయా స్ట్రాటజీ…!!
తెలంగాణ రాజకీయాలను ఇప్పటికే కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో (phone tapping) కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రభుత్వం విచారించిన ఈ కేసును ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐకి (CBI) ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కాళేశ్వరం అవినీతిపై విచారణను సీబీఐకి అప్పగించిన రేవంత్ (CM Revanth Reddy) సర్కార్, ఇప్పడు ఫోన్ ట్యాపింగ్ ను కూడా కేంద్రం చేతుల్లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇదే జరిగితే బీఆర్ఎస్ తో పాటు కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులతో పాటు పలువురు జాతీయ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. అందుకే దీన్ని సీబీఐకి అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 2023 డిసెంబర్ లో దీనిపై కేసు నమోదైంది. మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) చీఫ్ టి.ప్రభాకర్ రావు, మరొక అధికారి డి.రమేష్ ఫిర్యాది మేరకు కేసు నమోదైంది. బీఆర్ఎస్ హయాంలో 6,500కి పైగా ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, పత్రికాధిపతులు, విలేకరులు, వ్యాపారవేత్తలు, సినిమా తారలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్ వంటి వారి ఫోన్లు టార్గెట్ అయ్యాయని తెలుస్తోంది. ఈ ట్యాపింగ్‌లు కేవలం రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా, మనీ లాండరింగ్, బ్లాక్‌మెయిలింగ్‌కు కూడా ఉపయోగించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సొంత కుటుంబసభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురైనట్లు కవిత ఇటీవల వెల్లడించారు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై దర్యాప్తుకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను ఏర్పాటు చేసింది. పలువురు కీలక వ్యక్తులను విచారించిన సిట్ ముఖ్య ఆధారాలు సేకరించింది. నవంబర్ 2023 మినహా మిగిలిన అన్ని ట్యాపింగ్ డేటాను ధ్వంసం చేసినట్లు సిట్ విచారణలో తేలింది. హార్డ్ డిస్కులు, మొబైల్‌లు డెలీట్ చేశారు. ఇది సిట్ కు పెద్ద సవాల్ గా మారింది. అయినప్పటికీ 600కి పైగా ఫోన్ నంబర్ల ట్యాపింగ్ ఆధారాలు సేకరించింది. ఈ ఆపరేషన్‌లో ఎస్ఐబీ డిప్యూటీ చీఫ్ జి. ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 2025లో అమెరికా నుంచి తిరిగి వచ్చిన ప్రభాకర్ రావు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి సూచనల మేరకు ట్యాపింగ్ జరిగినట్లు చెప్పారు. ఇది మరో మలుపు తీసుకుంది. కీలక సాక్షులలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, కేంద్రమంత్రి బండి సంజయ్ లాంటి వారున్నారు. వీళ్లంతా సిట్ ముందు హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును ఇప్పుడు సీబీఐకి ఇచ్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణను ఈ ఏడాది ఆగస్టు చివర్లో సీబీఐకి అప్పగించింది. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో తప్పిదాలు, అవినీతి జరిగినట్లు తేలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చించి దీన్ని సీబీఐ విచారణ అవసరం అని ప్రకటించారు. సీబీఐకి అప్పగించడంతో బీఆర్ఎస్ డీలా పడింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐ చేతులో పెడుతుండడంతో ఇంకెన్ని సమస్యలు ఎదురవుతాయోననే భయం బీఆర్ఎస్ శ్రేణుల్లో మొదలైంది.
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ బీజేపీ నుంచి బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్, కేటీఆర్‌పై చర్య తీసుకునే ధైర్యం లేదని, సీబీఐకి ఇస్తే వారు ఇప్పటికే జైలులో ఉండేవారని బండి సంజయ్ చెప్పారు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ కేసును వ్యూహాత్మకంగా కేంద్రం చేతిలో పెట్టేందుకు సిద్ధమవుతోంది. అలా చేయడం ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అనే బీజేపీ ఆరోపణలకు చెక్ పడుతుంది. కేంద్రంలోని బీజేపీ.. బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోకపోతే ఆ రెండూ ఒక్కటేనని విమర్శించే హక్కు కాంగ్రెస్ కు దొరుకుతుంది. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ ఎత్తుగడ వేసినట్లు అర్థమవుతోంది.







