BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!

ఇండియన్ క్రికెట్ కు కొత్త సెలెక్టర్లు రానున్నారా..? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. త్వరలోనే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ పదవీకాలం ముగుస్తుంది. ఆ తర్వాత కొత్త సెలెక్టర్ల ఎంపిక మొదలవుతుంది. వెస్టిండీస్ పర్యటన తర్వాత టీమిండియా ఆడబోయే ఆస్ట్రేలియా(Australia) సీరీస్ కు టీంను కొత్త సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్ కమిటీ, విండీస్ టూర్ కు జట్టును ఎంపిక చేస్తుంది. ఇక సమర్థవంతమైన సెలెక్టర్ ల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వేట మొదలు పెట్టింది.
సాంప్రదాయం ప్రకారం, మాజీ క్రికెటర్ల నుంచి సెలెక్టర్లను ఎంపిక చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది టీమిండియా. మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పి సింగ్ తో పాటుగా.. హైదరాబాదీ మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సెలక్టర్లుగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు, దాదాపుగా ఖాయం అయ్యాయి. ఆర్పీ సింగ్ ధోనీకి అత్యంత సన్నిహితుడు కాగా ఓజా రోహిత్ శర్మకు మంచి ఫ్రెండ్. దీనికి సంబంధించి ఇప్పటికే బోర్డు ఎంపిక పూర్తి చేసిందని, అయితే అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం.
ఆస్ట్రేలియా పర్యటనలో ఓటమి తర్వాత సెలక్షన్ కమిటీ విషయంలో బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంది. అటు కోచింగ్ స్టాఫ్ విషయంలో కూడా బోర్డు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆసియా కప్ తర్వాత కొన్ని కీలక మార్పులు ఉండవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బౌలింగ్ కోచ్ మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక సెలక్షన్ కమిటీ విషయంలో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయాన్ని పూర్తిగా పక్కన పెట్టి.. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
దీనికి సంబంధించి ఇప్పటికే టీమిండియా సీనియర్ క్రికెటర్లతో కూడా మాట్లాడి, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే రెండు వారాల్లో దీనిపై బోర్డు పెద్దలు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అటు బీసీసీఐ అధ్యక్షుడి విషయంలో కూడా బోర్డు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు జట్టులో, బోర్డులో మరిన్ని కీలక మార్పులు జరగవచ్చు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.