YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, అసెంబ్లీ(Ap Assembly) సమావేశాలకు వెళ్లకపోవడం పై వైసీపీ కార్యకర్తలలో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. 2014 నుంచి 2019 వరకు జగన్ కొంతకాలం పాటు అసెంబ్లీకి వెళ్లారు. అప్పట్లో ప్రతిపక్ష హోదా ఉండటంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కాలేదు. పాదయాత్ర కోసమే సమావేశాలకు దూరమయ్యారు జగన్. అయితే 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉండటంతో జగన్, రెగ్యులర్ గా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడమే కాకుండా, విపక్షంపై విరుచుకుపడేవారు.
అయితే 2024 లో అధికారం కోల్పోయిన తర్వాత జగన్ మాత్రం, సభకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తానని జగన్ పట్టుబట్టి కూర్చున్నారు. ఇక తర్వాత తనకు అసెంబ్లీకి వెళ్లిన సరే, సమయం ఇవ్వరని, అందుకే తాను అసెంబ్లీకి వెళ్లడం లేదంటూ కూడా ప్రకటించారు. అటు ఎమ్మెల్యేలను కూడా సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్సీలు మాత్రం రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు.
గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎమ్మెల్సీలు సభకు హాజరయ్యారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ నాయకత్వంలో ఎమ్మెల్సీలు సభకు హాజరవుతున్నారు. అయితే జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినా సరే చంద్రబాబు మాత్రం ధైర్యంగా సమావేశాలకు హాజరు కావడమే కాకుండా, తనపై ఎన్ని విమర్శలు చేసినా సరే సభలోనే ఉండేవారు చంద్రబాబు.
ఈ విషయాలను ప్రస్తావిస్తూ వైసిపి కార్యకర్తలు జగన్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారట. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), అసెంబ్లీ సమావేశాలకు గతంలో వెళ్లేందుకు ప్రయత్నం చేసేవారు. సభలో తనకు ఎటువంటి బలం లేకపోయినా సరే సభకు అవకాశం వస్తే వెళ్లడానికి ఆసక్తి చూపించేవారు. కానీ జగన్ మాత్రం సభకు వెళ్లి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా సరే వెళ్లడం లేదు. జగన్ ఎన్ని మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం పై విమర్శలు చేసిన సరే, అసెంబ్లీకి వెళ్లిన ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ప్రభుత్వానికి కూడా చెక్ పెట్టినట్లు ఉంటుంది. కానీ జగన్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో, అటు వైసిపి కార్యకర్తలు కూడా ఏ విధంగానూ తమ అధినేతను సోషల్ మీడియాలో సమర్ధించలేని పరిస్థితి ఏర్పడింది.