Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..

అగ్రరాజ్యం అమెరికా టారిఫ్ బాదుడుతో పాటు హెచ్ 1 బి వీసా రూపంలో చార్జీలను లక్ష డాలర్లకు పెంచేసింది. ఇతర యూరప్ దేశాలు కూడా… వలసదారులంటూ వివిధ దేశాలప్రజలను బయటకు పంపిస్తున్నాయి. తమ దేశంలోని వారికి ఉద్యోగాలు రావాలంటూ ఆయా దేశాల్లో ఆందోళనలు పెరిగిపోయాయి.ఇతర దేశాలకు చెందిన ప్రజలపై దాడుల వరకూ వెళ్తున్నాయి. అది జాత్యహంకార ధోరణికి సైతం దారి తీస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రధాని మోడీ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘‘నాగరిక్ దేవోభవ..నినాదంతో ముందుకెళ్తున్నాం. రోజువారీ జీవితంలో మనం అనేక విదేశీ వస్తువులు వాడుతున్నాం. వీటి వాడకం తగ్గించాలి. భారత్‌లో తయారైన వస్తువులే మనం వాడాలి. దేశ ప్రజలంతా స్వదేశీ మంత్రం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతి పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోవాలి’’ అని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీలో మార్పులు (gst changes) అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేవీ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం నుంచి జీఎస్టీ ఉత్సవ్ (GST) ప్రారంభం కాబోతోందని, కొత్త చరిత్ర మొదలవుతోందని పేర్కొన్నారు. తదుపరి తరం జీఎస్టీ (Next Gen GST) సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని, ఇవి అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనకరమన్నారు.
‘‘గతంలో అనేక పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోని అన్ని వర్గాలతోనూ చర్చించి ఈ సంస్కరణలు తెచ్చాం. సోమవారం నుంచి కేవలం రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయి. తాజా మార్పులతో వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. ప్రజల పొదుపు పెరుగుతుంది’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
‘‘పేదలు, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే అనేక వస్తువులపై సున్నా జీఎస్టీ ఉంటుంది. ఇది వారికి డబుల్ బొనాంజా. ఇప్పటికే రూ.12లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాం. జీఎస్టీ సవరణలతో ఇప్పటివరకు 12శాతం పరిధిలో ఉన్న 99శాతం వస్తువులు 5శాతం పరిధిలోకి వచ్చాయి. రేపటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఆరోగ్య బీమా, ఔషధాల ధరలు తగ్గుతాయి. హోటల్స్ సేవలపై పన్నులు తగ్గించాం. జీఎస్టీతో వన్ నేషన్-వన్ ట్యాక్స్ స్వప్నం సాకారమైంది’’ అని ప్రధాని తన ప్రసంగంలో వివరించారు.