TTD: దొంగతో రాజీ కుదుర్చుకుంటారా..? తిరుమల ఘటనపై రచ్చ..!!

తిరుమల పరకామణీలో (Parakamani) దొంగతనం వ్యవహారం ఇప్పుడు వైసీపీ (YCP), కూటమి (NDA) మధ్య రచ్చ రాజేస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి (Bhuamana Karunakar Reddy) టీటీడీ (TTD) ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఓ ఉద్యోగి పలుమార్లు దొంగతనాలకు పాల్పడ్డాడు. దీనిపై టీటీడీ కేసు పెట్టింది. అయితే లోక్ అదాలత్ లో దీనిపై రాజీ కుదుర్చుకున్నారు. దొంగతనం చేసిన వ్యక్తితో ఎలా రాజీ కుదుర్చుకుంటారని ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి (Bhanu Prakash Reddy) ప్రశ్నిస్తున్నారు. పైగా దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని బెదిరించి వైసీపీ నేతలు, టీటీడీ అధికారులు కొందరు ఆస్తులు రాయించుకున్నారని, త్వరలోనే ఆ వివరాలన్నీ బయటకు వస్తాయని ఆయన చెప్తున్నారు.
అయితే రవికుమార్ దొంగతనం చేస్తున్నప్పుడు గుర్తించి పట్టుకున్నదని తమ హయాంలోనేనని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టుకోలేదని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రవికుమార్ కుటుంబసభ్యులు పశ్చాత్తాపంతో చేసిన తప్పు ఒప్పుకుని టీటీడీకి కోట్ల విలువైన ఆస్తులను రాసిచ్చారని, అందుకే రాజీ కుదిరిందని భూమన అంటున్నారు. రవికుమార్ నుంచి తాను కానీ, తన బినామీలు కానీ లబ్దిపొందినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రవికుమార్ దొంగతనం వ్యవహారంపై సీఐడీతో కాకుండా సీబీఐ విచారణ జరిపించాలని, అప్పుడే నిజాలు బయటకు వస్తాయని చెప్తున్నారు.
అయితే భూమన వాదనను భానుప్రకాశ్ రెడ్డి ఖండించారు. స్వామివారి సొమ్ము దొంగతనం చేస్తే రాజీ కుదుర్చుకునే అధికారం వీళ్లకు ఎవరిచ్చారని భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. భూమన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు రవికుమార్ దొంగతనం చేస్తుండగా పట్టుకున్నారని, ఆయన ఛైర్మన్ గా ఉన్నప్పుడు రాజీ కుదుర్చుకున్నారని మరోసారి ఆయన ఉద్ఘాటించారు. సెటిల్మెంట్ ద్వారా 40 కోట్లకు పైగా విలువైన ఆస్తులను టీటీడీకి కల్పించినప్పుడు భూమన అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. రవికుమార్ కుటుంబసభ్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. రవికుమార్ బతికి ఉన్నాడో లేదో అనుమానంగా ఉందన్నారు. రవికుమార్ నుంచి తీసుకున్న సొమ్ము భూమన, ధర్మారెడ్డి, జగన్ కు చేరిందని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసును విచారించడానికి సీబీఐ అక్కర్లేదని, ఎస్సై స్థాయి అధికారి చాలని స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు.
పరకామణీలో దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ కుదుర్చుకోవడంపై హైకోర్టు సీరియస్ అవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లోక్ అదాలత్ లో ఎలా రాజీ కుదుర్చుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై లోతైన సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో టీటీడీ బోర్డు ఈ కేసును మళ్ళీ తెరపైకి తెచ్చింది. వైసీపీ హయాంలో ఏ జరిగిందనేదానిపై ఆరా తీస్తోంది. ఇంతలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న భాను ప్రకాశ్ రెడ్డి, నాటి రాజీ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ కుదుర్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.